Trolls on Kesineni Nani: వైరల్ అవుతున్న మాజీ ఎంపీ వీడియోలు.. విరుచుకుపడుతున్న తెలుగు తమ్ముళ్లు..
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:43 PM
కొన్ని నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయవాడ మాజీ ఎంపీ కేశనేని నాని ఇటీవల గొల్లపూడి, తిరువూరు, నందిగామ ప్రాంత నాయకులతో టచ్‌లో ఉంటున్నారు. వారిని రెగ్యులర్‌గా కలుస్తూ మాటామంతి కలుపుతున్నారు.
అమరావతి: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీడీపీకి నాని రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. ఓటమిని జీర్ణించుకోలేని శ్రీనివాస్ తాను ఇకపై రాజకీయాల్లో కొనసాగనంటూ 10, జూన్ 2024న ప్రకటించారు. అయితే తన మాటలకు విరుద్ధంగా తాజాగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నేతలను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. ఆయన ఇటీవల వివిధ సభల్లో మాట్లాడిన వీడియాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీంతో నాని పాత, కొత్త వీడియోలను కలిపి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ తెలుగు తమ్ముళ్లు పోస్టులు పెడుతున్నారు.
కాగా, కొన్ని నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ నాని ఇటీవల కాలంలో గొల్లపూడి, తిరువూరు, నందిగామ ప్రాంత నాయకులతో తరచూ టచ్‌లో ఉంటున్నారు. వారిని రెగ్యులర్‌గా కలుస్తూ మాటామంతి కలుపుతున్నారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ సమావేశంలో నేతలతో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మాజీ ఎంపీ నాని మాట్లాడుతూ.."గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. గతేడాది జూన్ 10న రాజకీయాల్లో కొనసాగనని ప్రకటించా. కానీ ఎప్పుడూ ప్రజా సేవ చేస్తూనే ఉంటా.
విజయవాడ అంటే నాకు పిచ్చి మమ్మకారం. విజయవాడ పార్లమెంట్ ప్రజలు నన్ను రెండుసార్లు ప్రజాసేవ చేసేందుకు గెలిపించారు. వేదికలెక్కి మాట్లాడతానని నేనెప్పుడూ అనుకోలేదు. నిరంతరం స్వార్థం లేకుండా పని చేశా. రెండు సార్లు ఎంపీగా గెలిచినా ఏనాడు ఆ పదవిని స్వార్థానికి వాడుకోలేదు. నాకు రతన్ టాటా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరి స్ఫూర్తిదాయకం. గడ్కరి పరిచయం విజయవాడ ప్రాంత అభివృద్ధికి వాడుకోగలిగాను. టాటా ట్రస్ట్ ద్వారా పార్లమెంట్ పరిధిలో ఎవరూ చేయనటువంటి సేవా కార్యక్రమాలు చేయగలిగాను" అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..
Household Budget: ఇంటి బడ్జెట్‌పై కేంద్ర మంత్రి పెమ్మసాని సతీమణి ఏం చెప్పారంటే..