Share News

Pawan On Siberian Birds: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వేళాయె.. సైబీరియన్ పక్షుల రాకపై పవన్ ట్వీట్

ABN , Publish Date - Nov 03 , 2025 | 02:55 PM

మూడు రోజుల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది పక్షి ప్రేమికులు హాజరవడం ఫ్లెమింగోలతో ఉన్న అనుబంధానికి నిదర్శనమని పవన్ చెప్పుకొచ్చారు. అక్టోబర్ మాసంలో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోయే ఈ విదేశీ అతిథులు... ఏపీ ఆతిథ్యం నచ్చిందో ఏమో ఈ మధ్య ఏడాది పొడుగునా కనువిందు చేస్తున్నాయని అన్నారు.

Pawan On Siberian Birds: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వేళాయె.. సైబీరియన్ పక్షుల రాకపై పవన్ ట్వీట్
Pawan On Siberian Birds

అమరావతి, నవంబర్ 3: పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథుల రాక మొదలైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) తెలిపారు. సైబీరియన్ పక్షుల రాకపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందించారు. పులికాట్ సరస్సుకు సైబీరియన్ పక్షులు వస్తున్నాయని.. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్న సైబీరియన్ పక్షులు, ఫ్లెమింగోలు అందరికీ కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయన్నారు. ఆహారం, విశ్రాంతి నిమిత్తం ఆరు నెలలపాటు మన పులికాట్ పరిసరాల్లో ఉంటాయని తెలిపారు. అందుకే ప్రతి ఏటా ఈ నీటి పక్షుల రాకను ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ పేరిట ఘనంగా వేడుక చేసుకుంటామన్నారు.


మూడు రోజుల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది పక్షి ప్రేమికులు హాజరవడం ఫ్లెమింగోలతో ఉన్న అనుబంధానికి నిదర్శనమని ఉపముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ముద్దుగా రాజహంస అని పిలుచుకునే ఫ్లెమింగోలు జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. అక్టోబర్ మాసంలో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోయే ఈ విదేశీ అతిథులు... ఏపీ ఆతిథ్యం నచ్చిందో ఏమో ఈ మధ్య ఏడాది పొడుగునా కనువిందు చేస్తున్నాయని అన్నారు.


ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఫ్లెమింగోలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫ్లెమింగోల ఆహారం, విశ్రాంతి, భద్రతకు ఇబ్బందులు కలగకుండా గత కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. ఈసారి మూడు రోజుల పండుగతో సరిపెట్టకుండా ఎకో టూరిజాన్ని విస్తరించే ప్రక్రియలో భాగంగా ఫోటోగ్రఫీ, బర్డ్ సీయింగ్, ఎకో క్లబ్ పేరిట వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మొంథా తుఫానుకు ముందు నుంచే ఫ్లెమింగోల రాక మొదలయ్యిందని పవన్ అన్నారు.


పెను గాలులు, భారీ వర్షాలకు వాటి స్థావరాలకు ఇబ్బంది కలగకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టామన్నారు. రానున్న మూడు నెలలు ఫ్లెమింగోల రక్షణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అటవీ అధికారులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. పులికాట్‌ను ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా మార్చేందుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వింగ్డ్ గెస్ట్స్ ఆఫ్ ఏపీ అని హ్యష్ ట్యాగ్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

జోగి రమేష్ కుటుంబసభ్యులు, అనుచరులపై కేసు నమోదు

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 04:14 PM