Share News

Nara Lokesh: పిల్లలకు నైతిక విలువలు చాలా అవసరం: మంత్రి లోకేష్

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:52 PM

మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సరికాదని మంత్రి లోకేష్ అన్నారు. జీవితంలో అవమానాలు సహజమని.. లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని చెప్పుకొచ్చారు.

Nara Lokesh: పిల్లలకు నైతిక విలువలు చాలా అవసరం: మంత్రి లోకేష్
Nara Lokesh

విజయవాడ, నవంబర్ 24: నైతిక విలువలు, సమాజంలో మార్పుకు సంబంధించి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. ఈరోజు (సోమవారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు, విద్యా సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. చాగంటికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించామని తెలిపారు. చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ వాహనం వాడలేదని.. సొంతంగానే తన ఫోన్ బిల్లు చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చారు. బడిలో పిల్లలకు ఆట పాటలు చదువుతో పాటు నైతిక విలువలు అందించాలని సూచించారు. ఆటోమిక్ ఎనర్జీని విద్యుత్ తయారీకి వాడితే దేశం అంతా ఘనంగా వెలుగుతుందని.. అదే ఆటోమిక్ ఎనర్జీని బాంబు తయారీకి వాడితే హిరోషిమా నాగసాకిలా తయారవుతుందని అన్నారు.


ప్రభుత్వం పుస్తకాలు రూపొందిస్తోందన్నారు. ఇంట్లో నుంచి మార్పు మొదలవ్వాలని.. తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలని కోరారు. మహిళలను గౌరవించినప్పుడు సమాజం బాగుపడుతుందని తెలిపారు. వెబ్ సిరీస్‌లోనూ మహిళలను అగౌరవంగా చూపకూడదన్నారు. మగవారు, మహిళలు ఇద్దరు సమానమే అని స్పష్టం చేశారు. పిల్లలను చూస్తే దేవుడిని చూసినట్టు ఉంటుందని.. వాళ్ళని బాగా చూసుకోవాలని పేర్కొన్నారు. డ్రగ్స్‌పై తమ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని.. దీన్ని అంతా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సరికాదన్నారు. జీవితంలో అవమానాలు సహజమని.. లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని చెప్పుకొచ్చారు. టీచర్ల సమస్యలు చాలా వరకు పరిష్కరించామని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు కరికులంలో మార్పులు తెస్తున్నామన్నారు. పుస్తకాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలు.. పార్టీ రంగులు లేవన్నారు. ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు.


తల్లిదండ్రులు పెట్టుకున్న బాధ్యతను పిల్లలు నిలబెట్టుకోవాలని సూచనలు చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా జయంతి కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. అక్కడకు వచ్చిన పిల్లలు ఓ చిన్న కాగితం చెత్తను కూడా వేయకుండా జాగ్రత్తగా అన్నింటిని చెత్తబుట్టలో వేయడం చాలా గొప్పవిషయమని కొనియాడారు. ఈ తరహా క్రమశిక్షణ అందరికీ రావాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో నైతిక విలువలపై ప్రసంగాలు చేయాలని చాగంటి కోటేశ్వరరావును మంత్రి నారా లోకేష్ కోరారు. కాగా.. ఈ సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు, ప్రవచన ప్రముఖులు చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించారు. మంత్రి లోకేష్‌తో పాటు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విద్యాశాఖ కార్యదర్శి సదస్సులో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైట్

రైతులను ఆర్థికంగా ఆదుకుంటాం.. ఇదే మా బాధ్యత: మంత్రి అచ్చెన్న

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 04:59 PM