Share News

CM Chandrababu On Smart Family Card: స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. ఇదే మా లక్ష్యం

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:21 PM

ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్‌ సిస్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu On Smart Family Card: స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. ఇదే మా లక్ష్యం
CM Chandrababu On Smart Family Card

అమరావతి: ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్‌ సిస్టంపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ఉంటుందన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్‌తో కుటుంబం, వ్యక్తుల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, పౌరసేవల పర్యవేక్షణకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ఒక్కటే ఉంటుందని తెలిపారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని చంద్రబాబు సూచించారు. కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్‌ సిస్టం అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు.


జూన్ నాటికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్

రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులకు సూచించారు. 25 రకాల సేవలతో పాటు పీ4 లాంటి అంశాలను అందులో చేర్చాలని తెలిపారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలని చెప్పారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు.


ఇదే మా లక్ష్యం

వాక్సినేషన్, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్‌షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్‌బీఎంఎస్ వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ఆదేశించారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించటంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొన్ని పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.


ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలన్నారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని, ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఆధార్ సహా అన్ని వివరాలు ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని చెప్పారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్‌లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.


Also Read:

డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైట్

జగన్ అండ్ కో కుట్రలు, కుతంత్రాలతో రగిలిపోతున్నారు: మంత్రి అనగాని

For More Andhra Pradesh News

Updated Date - Nov 24 , 2025 | 04:38 PM