Lokesh Montha Cyclone Review: బాధితులకు సహాయం చేయండి.. నేతలకు మంత్రి లోకేష్ ఆదేశాలు
ABN , Publish Date - Oct 29 , 2025 | 02:14 PM
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను మంత్రి లోకేష్ ఆరా తీశారు. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని మంత్రికి అధికారులు వివరించారు.
అమరావతి, అక్టోబర్ 29: మొంథా తుపానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) రెండో రోజు సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో మొంథా తుపాను తీవ్రత, ఇప్పటి వరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. మొంథా తుపాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని మంత్రికి అధికారులు వివరించారు.
ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.
అర్థరాత్రి కూడా...
కాగా.. మొంథా తుపాను తీవ్రతపై మంత్రి లోకేష్ ఆర్టీజీఎస్ కేంద్రంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అర్థరాత్రి 12 గంటలకు కూడా ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాత్రి అక్కడే బస చేశారు. అర్థరాత్రి తుపాను తీరం దాటిన నేపథ్యంలో అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సంప్రదించి తుపాను తీవ్రత, సహాయక చర్యలపై వాకబు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
అన్ని రేషన్ షాపులకు నిత్యావసర సరుకులు.. పవన్ ట్వీట్
బాహుదా నదికి పోటెత్తిన వరద.. ఇచ్ఛాపురం జలదిగ్భంధం
Read Latest AP News And Telugu News