Share News

SIT Officers: లిక్కర్ స్కాం.. మదన్‌రెడ్డి ఆరోపణలపై సిట్ క్లారిటీ

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:34 PM

SIT Officers: మద్యం కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని సిట్ అధికారులు చెప్పారు. దర్యాప్తులో కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్లు తేలిందన్నారు.

SIT Officers: లిక్కర్ స్కాం.. మదన్‌రెడ్డి ఆరోపణలపై సిట్ క్లారిటీ
SIT Officers

విజయవాడ, జూన్ 17: మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Case) మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి (Chevireddy Bhaskar Reddy) వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధిస్తున్నారంటూ డీజీపీకి గన్‌మెన్ మదన్ రెడ్డి లేఖ రాయడం సంచలనం రేపుతోంది. అయితే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ సిట్ అధికారులు (SIT Officers) మీడియాకు ప్రకటనను విడుదల చేశారు. చెవిరెడ్డి దగ్గర గన్‍మెన్‍ (పీఎస్‌వో)గా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి పని చేశారని తెలిపారు. లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని మదన్ రెడ్డి చెప్పడంలో నిజం లేదని స్పష్టం చేశారు. చెవిరెడ్డికి కేసుతో సంబంధం ఉందని చెప్పమన్నారని, తప్పుడు స్టేట్‍మెంట్ ఇవ్వమని బలవంతం చేశారనేది కూడా వాస్తవం కాదని సిట్ అధికారులు తేల్చిచెప్పారు.


మద్యం కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. దర్యాప్తులో కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర రెడ్డికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్లు తేలిందన్నారు. ఈ నగదును ఎన్నికల సమయంలో ప్రజలకు పంచినట్లు తెలిసిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పర్సనల్ గన్ మెన్‌గా చేసిన మదన్ రెడ్డిని విచారణకు పిలిచామన్నారు. అతను విచారణకు సహకరించకుండా సిట్ అధికారులనే ‘మీ పేర్లు రాసి చనిపోతాను’ అని బెదిరించినట్లు తెలిపారు. మద్యం కుంభకోణం కేసును ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ మొదటి నుంచీ చాలా పారదర్శకంగా, నిబద్దతతో విచారణ చేస్తోందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 200 మందికి నోటీసులు ఇచ్చి సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించడం జరిగిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఆరోపణలు రాలేదన్నారు.


మదన్ రెడ్డి డ్రామాలను కొన్ని ఛానల్స్‌లో వైరల్ చేశారని తెలిపారు. దీని వెనక కుట్ర కోణం ఉన్నదని తమ ప్రగాఢ నమ్మకమన్నారు. చెవిరెడ్డితో సంబంధం ఉన్న బాలాజీ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని సిట్ పోలీస్ అక్రమ నిర్భంధం చేశారని హైకోర్ట్‌లో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారని.. ఇది కూడా పచ్చి అబద్దమన్నారు. ఈ రెండు సంఘటనలు చూస్తుంటే.. సిట్ దర్యాప్తుపై ఒత్తిడి తెచ్చి విచారణను బలహీన పరచాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ స్కాంలో దోషులు ఎంత స్థాయి వారు అయినా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చట్టం ముందు నిలబెడతామని సిట్ అధికారులు స్పష్టం చేశారు.


బెయిల్ పిటిషన్లు వాయిదా

మరోవైపు లిక్కర్ స్కాంలో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ ఈనెల 19కి వాయిదా పడ్డాయి. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఏ8 చాణక్య, ఏ30 దిలీప్‌ల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు ఈనెల 19కు వాయిదా వేసింది. అలాగే లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లను ఈ నెల 20కి వాయిదా పడింది. ఇదే కేసులో ఏ33 గోవిందప్ప బాలాజీ బెయిల్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఈఏసీ కీలక భేటీ

ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 05:13 PM