Judge Reacts Trolls: జడ్జిపై ట్రోల్స్.. బెంచ్‌పైనే జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 03 , 2025 | 02:50 PM
Judge Reacts Trolls: తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తరువాత న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి.. బెంచ్ మీదనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి, జులై 3: ఏపీ హైకోర్ట్‌లో (AP High Court) బెంచ్ మీదనే న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాల్లలో జగన్ పర్యటన సందర్భంగా ఆయన కారు కిందే పడి సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసులను కొట్టి వేయాలంటూ మాజీ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. గత వారం సింగయ్య కేసులో జగన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీంతో ఈ వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. తాజాగా.. ఈ ట్రోల్స్‌పై బెంచ్ మీదనే స్పందించారు జస్టిస్.
ఈరోజు (గురువారం) తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తరువాత న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫ్ఫైర్స్’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్‌కు బాగా పనికి వస్తాయంటూ జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు. అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కేసులను వచ్చే మంగళవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. అంతేకాకుండా తన ముందున్న బెయిల్ కేసుల అన్నీ వచ్చే వారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
బెయిల్ మంజూరు
కాగా.. టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ (ఏ3), విపిన్ జైన్ (ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావడా (ఏ5)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తుకు సహకరించాలని, దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని పిటిషనర్లకు న్యాయస్థానం స్పష్టం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ)నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఈ ముగ్గురు కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి .. ఈరోజు పిటిషనర్లకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
జైలు నుంచి విడుదల తర్వాత జగన్‌ను కలిసిన వంశీ
బ్యాలెట్ విధానంలో ఎన్నికలు.. వైవీ సుబ్బారెడ్డి డిమాండ్
Read latest AP News And Telugu News