World Environment Day: మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వండి.. సీఎం చంద్రబాబు పిలుపు
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:21 PM
World Environment Day: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం అవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

అమరావతి, జూన్ 5: అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలన అంశాన్ని థీమ్‌గా తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబు ట్వీట్ ఇదే
‘ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తూ కాదు.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. అడవులను కాపాడుకోవడం, జలవనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నా. మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది. అందుకే స్వచ్ఛ భారత్‌లో భాగంగా మనం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టాం. చెత్తను ఇంధనంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతున్నాం. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలన అంశాన్ని థీమ్‌గా తీసుకున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా పనిచేద్దాం. పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకుందాం’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
కోటి మొక్కలు నాటడమే లక్ష్యం: పట్టాభి
మరోవైపు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు అర్జున్ రావు, ఊర్మిళ.. కాలనీలో ఉన్న పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ.. చిప్కో మూమెంట్ తీసుకువచ్చిన సుందర్లాల్ బహుగుణ స్పూర్తితో వనమహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. వనజీవి రామయ్య ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఈ పర్యావరణానికి కోట్లాది మొక్కలు నాటి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. వీరి స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా వనమహోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి పిలుపునిచ్చి పర్యావరణానికి మేలు చేసే పనులకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా స్థానిక ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నామన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 50 శాతం ఫారెస్ట్ కవర్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పట్టాభి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా కలకలం.. అనంతలో తొలి కేసు
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం
Read Latest AP News And Telugu News