Maoists In Court: మావోయిస్టులకు రిమాండ్ విధించిన కోర్టు..
ABN , Publish Date - Nov 19 , 2025 | 02:45 PM
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాల్లో చిక్కిన 50 మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది.
అమరావతి, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో అరెస్టయిన 50 మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మరణించారు. మరోవైపు అదే సమయంలో ఏలూరు, కాకినాడ, విజయవాడలలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా ఆయా నగరాల్లోని ఆ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి.. భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా వీరి నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా భద్రతను పర్యవేక్షించే జ్యోతి సైతం ఉన్నట్లు సమాచారం. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రధాన నగరాలకు వీరు ఎందుకు వచ్చారు. దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? ప్రముఖులను ఎవరినైనా టార్గెట్ చేసుకున్నారా? అనే కోణంలో మావోయిస్టులను పోలీసులు విచారిస్తున్నారు.
2026, మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం.. ఆపరేషన్ కగార్‌ను తెరపైకి తీసుకు వచ్చింది. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు కూంబింగ్‌ను తీవ్రతరం చేశాయి. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు వచ్చారనే ఒక చర్చ సైతం సాగుతోంది. అదీకాక ఈ ప్రాంతాన్ని తమకు షెల్టర్ జోన్‌గా ఉపయోగించు కోవచ్చని వారు భావించారని అందుకే ఏపీకి వచ్చారని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సత్యసాయి బాబా ఐదు విధానాలు ఆదర్శం: ఐశ్వర్యరాయ్ బచ్చన్
మావోలకు దెబ్బ మీద దెబ్బ... నిన్న హిడ్మా.. నేడు మరికొందరు
Read Latest AP News And Telugu News