Share News

AP Liquor Scam: లిక్కర్ స్కాంలో నిందితుల విచారణ.. సిట్ ప్రశ్నలు ఇవే

ABN , Publish Date - May 30 , 2025 | 04:33 PM

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితులను ఐదు గంటలుగా సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. వీరిని సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు.

AP Liquor Scam: లిక్కర్ స్కాంలో నిందితుల విచారణ.. సిట్ ప్రశ్నలు ఇవే
AP Liquor Scam

విజయవాడ, మే 30: ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో (AP Liquor Scam) నిందితుల విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కోర్టు(ACB Court) అనుమతితో లిక్కర్ స్కాంలో నలుగురు నిందితులను ఈరోజు (శుక్రవారం) ఉదయం సిట్ అధికారులు (SIT Officers) కస్టడీలోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు నేరుగా విచారించారు. దాదాపు ఐదు గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితు ఏ1 రాజ్ కసిరెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ చీఫ్ విచారించారు. స్కాంలో ఈ నలుగురి పాత్ర కీలకంగా ఉందని ఇప్పటికే సిట్ గుర్తించిన విషయం తెలిసిందే.


కస్టడీలో భాగంగా స్కాంలో వసూలు చేసిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ ఖరీదైన ఆస్తులు కొన్నారని నిందితులను సిట్ చీఫ్ ప్రశ్నించారు. ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారని ప్రశ్నలు సంధించారు. అలాగే నిందితుల కుటుంబ సభ్యుల వ్యాపారాల్లో పెట్టుబడులుగా వచ్చిన డబ్బుల గురించి బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా నిందితులను ప్రశ్నించారు సిట్ చీఫ్. 2019 - 2024 సమయంలో నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను రిజిస్ట్రార్ శాఖ నుంచి సిట్ సేకరించింది. దీంతో ఈ ఆస్తుల వివరాలపై నిందితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.


కాగా.. లిక్కర్ కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని సిట్ అరెస్ట్ చేసింది. వారిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారి, పాత్రధారిగా ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఆయన తరువాత అరెస్ట్ చేసిన సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణుక్య, దిలీప్ పాత్ర కొంత మేరే అని సిట్ విచారణలో బయటపడింది. అయితే ముందుగా కసిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా.. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్రలు కూడా కీలకం అని గుర్తించి.. వారిని ఇటీవలే అరెస్ట్ చేశారు. దీంతో కసిరెడ్డితో పాటు వీరు ముగ్గిరినీ కస్టడీకి ఇస్తే మరింత సమాచారం సేకరించే అవకాశం ఉందంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు.


వాదనలు విన్న న్యాయాధికారి నేడు, రేపు రెండు రోజుల పాటు నలుగురిని కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చారు. దీంతో ఈరోజు ఉదయం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నలుగురిని తీసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తరలించి విచారణ మొదలుపెట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో దాదాపు 5 గంటలకు ఈ నలుగురిని స్వయంగా సిట్ చీఫ్ విచారిస్తూ.. ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 09:24 AM