Share News

AP CM Chandrababu: క్రీస్తు మార్గాన్ని అనుసరించాలి

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:40 AM

నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు మార్గాన్ని అందరూ అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

AP CM Chandrababu: క్రీస్తు మార్గాన్ని అనుసరించాలి
CM Chandrababu Naidu

  • నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికీ వెనుకాడలేదు

  • సమాజసేవలో కీలకంగా క్రైస్తవ సంఘాలు: చంద్రబాబు

  • ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

విజయవాడ, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు మార్గాన్ని అందరూ అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రపంచానికి శాంతి, ప్రేమ, దయ, కరుణ అందించిన క్రీస్తు మార్గంలో క్రైస్తవ సోదరులు, రాష్ట్ర ప్రజలు నడవాలని కోరారు. సోమవారం విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో ప్రభుత్వం అధికారికంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద పండుగ క్రిస్మస్‌ అన్నారు. క్రైస్తవ సంఘాలు సమాజసేవలో కీలకంగా వ్యవహరిస్తాయని కొనియాడారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చే పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రుల వంటివి ప్రభుత్వాలు కట్టలేని సమయంలో క్రైస్తవ సంఘాలు కట్టి చూపించాయని ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు కూడా క్రైస్తవ మిషనరీ పాఠశాలలోనే చదువుకున్నారని చెప్పారు. పాస్టర్లకు గౌరవవేతనంగా రూ.5వేలు ఇస్తున్నామని, గత ప్రభుత్వం క్రైస్తవులను మోసం చేసి ఆ గౌరవవేతనాలను మధ్యలోనే ఆపేసిందని ఆరోపించారు.


ఆ బకాయిలతో కలిపి రూ.60 కోట్ల వరకు క్రిస్మస్‌ సందర్భంగా ఈ నెల 24 సాయంత్రానికి అకౌంట్లలో వేస్తామని తెలిపారు. జెరూసలెం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయమందిస్తున్నామన్నారు. 2025-26లో రూ.20 కోట్లతో 2 వేల మంది క్రైస్తవులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. గత ఐదేళ్లలో మరుగున పడిన అభివృద్ధిని ఏడాదిన్నర కాలంలో పట్టాలెక్కించామని చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిందని, ఎంతలోతుకు వెళితే అంత భయమేస్తోందని వ్యాఖ్యానించారు. అనంతరం క్రైస్తవ మతపెద్దలు, పాస్టర్లతో కలిసి క్రిస్మస్‌ కేక్‌ను చంద్రబాబు కట్‌ చేశారు. తొలుత చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిన ఇతివృత్తాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Gold Rates on Dec 23: గ్రాముకు ఒక్క రూపాయి పెరిగిన బంగారం.. నేటి ధరలివే..

Trump-India: భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపా.. ట్రంప్ నోటి వెంట మళ్లీ పాత పాట

Updated Date - Dec 23 , 2025 | 07:52 AM