Amaravathi ORR: అమరావతి ఓఆర్ఆర్.. ఇంకో ఏడాది ఆగాల్సిందే.!
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:20 AM
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) సాకారానికి మరో ఏడాది సమయం పట్టేలా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 3ఏ ప్రతిపాదనల్లో పురోగతి నెలకొన్నా.. వివిధ దశలు పూర్తవడానికి దాదాపు సంవత్సరం పట్టే అవకాశముందని ఎన్‌హెచ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటికి గానీ ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు.
విజయవాడ, నవంబర్ 28: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు రూపొందించిన ఆర్థిక ప్రతిపాదనలు.. తుది అనుమతుల కోసం ప్రస్తుతం పీపీపీ అప్రైజల్ కమిటీ దృష్టికి వెళ్లాయి. ఇక్కడ ఓఆర్ఆర్ ప్రాజెక్టుపై అధ్యయనం జరుగుతోంది. అనుమతులు ఇచ్చాక.. కేంద్ర క్యాబినెట్ దశకు చేరుకుంటుంది. అక్కడి నుంచి అనుమతులు రావడం లాంఛనమే. ఈలోగా సమాంతరంగా కొన్ని ప్రక్రియలు ముగించాల్సి ఉంది.
3ఏ ప్రతిపాదనలు కొలిక్కి..
ఓఆర్ఆర్‌కు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3ఏ ప్రతిపాదనలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా పంపిన 3ఏ ప్రతిపాదనలు తప్పులుగా ఉండటం వల్ల వాటిని ఎన్‌హెచ్ అధికారులు వెనక్కి పంపారు. వాటిని సరిచేసిన రెవెన్యూ యంత్రాంగం తిరిగి ఎన్‌హెచ్‌కు పంపింది. కృష్ణా జిల్లా నుంచి కూడా దాదాపు 3ఏ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిని పరిశీలించాక ఎన్‌హెచ్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. రెండు జిల్లాల యంత్రాంగాలు స్థానికంగా గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేస్తాయి. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో గెజిట్ నోటిఫికేషన్‌ను అప్లోడ్ చేస్తాయి. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసినప్పటి నుంచి 21 రోజుల్లో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్లు.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. వారి నుంచి సమాచారం సేకరించటం పూర్తయ్యాక... రెవెన్యూ, ఎన్‌హెచ్ వర్గాలు జాయింట్ సర్వే నిర్వహిస్తాయి. అభ్యంతరాల ప్రకారం క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలను గుర్తిస్తారు. ఇలా అభ్యంతరాలన్నింటినీ పూర్తిచేశాక.. గెజిట్లో పేర్కొన్న నిర్దేశిత భూములకు సరిహద్దు రాళ్లు పాతుతారు.
తుది గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు?
ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 140 మీటర్ల వెడల్పుతో మొత్తం 5 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ కోసం 5 వేల ఎకరాల్లో 140 మీటర్ల వెడల్పునకు తగినట్టుగా సరిహద్దు రాళ్లను వేస్తారు. ఇలా మొత్తం అలైన్‌మెంట్ పరిధిలో సరిహద్దు రాళ్లను వేశాక తుది గెజిట్ నోటిఫికేషన్‌ను మొత్తంగా 5 జిల్లాల పరిధిలో ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. అప్పటికి గానీ ప్రతిపాదిత భూములు ఎన్‌హెచ్ స్వాధీనం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు కేసులు ఎదురైతే కొంత కాలయాపన కూడా జరగొచ్చు.
అనుమతులు అనేకం..
తుది గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక టెండర్ల ప్రక్రియకు వెళ్లడానికి మరికొంత సమయం పడుతుంది. అమరావతి ఓఆర్ఆర్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. పర్యావరణ అనుమతులకు సంబంధించి కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు మరికొంత సమయం పడుతుంది. దీంతో పాటు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఓఆర్ఆర్ పరిధిలోకి వస్తున్నాయి. అటవీ శాఖ క్లియరెన్స్‌లు కూడా తీసుకోవాలి. ఎంత అటవీ విస్తీర్ణం పోతుందో.. అంతమేర ప్రత్యామ్నాయంగా అడవిని అభివృద్ధి చేయాలి. అనంతరం హైటెన్షన్ ట్రాన్స్‌మిషన్ టవర్ల మార్పిడి జరగాలి. ఇవన్నీ పూర్తయ్యాక మాత్రమే టెండర్ల దశకు వెళ్తుంది. కాబట్టి.. కనిష్ఠంగా ఏడాది సమయం, గరిష్ఠంగా రెండేళ్లకు పైగానే ఓఆర్ఆర్ శ్రీకారానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
విజయవాడ మెట్రో ప్రాజెక్ట్.. గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు.?