Share News

Mixed Reactions to District Reorganization: ఇష్టం.. కొంచెం కష్టం

ABN , Publish Date - Nov 28 , 2025 | 06:18 AM

జిల్లాల పునర్విభజనపై ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం కాగా, గిద్దలూరు నియోజకవర్గ ప్రజలలో మాత్రం అసంతృప్తి నెలకొంది. పశ్చిమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న విధంగా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలు కలిపి కొత్త.....

Mixed Reactions to District Reorganization: ఇష్టం.. కొంచెం కష్టం

గత జగన్‌ ప్రభుత్వంలో చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనేక చిక్కుముడులు తెచ్చిపెట్టింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చాలా చోట్ల తీవ్ర వ్యతిరేకత, అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సరిదిద్దుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కొత్తగా మూడు జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని చోట్ల హర్షం వ్యక్తమవుతుండగా, మరికొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల కేంద్రాలకు దగ్గరగా, అనుకూలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు, మండలాలను పక్క జిల్లాలు, ఇతర రెవెన్యూ డివిజన్లలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే కొన్నింటిని మార్చకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు హామీ ఇచ్చినా..

మదనపల్లె జిల్లాలో పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సదుం, సోమల మండలాలను కలపడంపై ఆ ప్రాంత ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తుండగా, పులిచెర్ల మండల ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. రొంపిచెర్ల వాసులు మాత్రం.. తమకు పక్కనే ఉన్న పీలేరు రెవెన్యూ కేంద్రంలో కాకుండా చిత్తూరులో ఉంచడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు. తిరుపతిలో కలపాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కూడా సిఫారసు చేసింది. కానీ అమలు కాలేదు. దీంతో ఆ మూడు మండలాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  • కొత్త జిల్లాలు.. మార్పుచేర్పులపై మిశ్రమ స్పందన

  • మార్కాపురంతో పాటు ప్రకాశం ఓకే

  • కానీ కనిగిరి డివిజన్‌లో కలపడంపై గిద్దలూరు నియోజకవర్గంలో వ్యతిరేకత

  • మదనపల్లె జిల్లాపై సర్వత్రా హర్షం

  • నెల్లూరుకు దూరంగా గూడూరు, వెంకటగిరి

  • మడకశిర డివిజన్‌పై సంతృప్తిసిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్యలో చేర్చడంపై అభ్యంతరం

  • గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలని వినతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాల పునర్విభజనపై ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం కాగా, గిద్దలూరు నియోజకవర్గ ప్రజలలో మాత్రం అసంతృప్తి నెలకొంది. పశ్చిమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న విధంగా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, దర్శి నియోజకవర్గాలతో పాటు గతంలో బాపట్ల జిల్లాలో కలిపిన అద్దంకి, నెల్లూరు జిల్లాలో చేర్చిన కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చారు. అలాగే ఈ జిల్లాలో అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ చేసి అందులో దర్శి, అద్దంకి నియోజకవర్గాలను చేర్చారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయంపై అన్ని ప్రాంతాల్లోనూ సానుకూలత వ్యక్తం అవుతోంది. అయితే కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపురం జిల్లాలో డివిజన్ల ఏర్పాటు విషయంలో గిద్దలూరు ప్రాంతవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మార్కాపురం డివిజన్‌లో ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలను తాజా ప్రతిపాదనలో దూరంగా ఉన్న కనిగిరి డివిజన్‌లోకి మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గిద్దలూరులోని ఆరు మండలాలు జిల్లా కేంద్రమైన మార్కాపురానికి 25 నుంచి 65 కి.మీ. దూరంలో ఉంటాయి. అన్నింటికీ రవాణా సౌకర్యం బాగుంది. కానీ 100 కి.మీ. దూరంలో ఉన్న కనిగిరి రెవెన్యూ డివిజన్‌లో కలపడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. సుదూరంగా ఉండటమే గాక రవాణాకు అనుకూలత లేని కనిగిరిలో కలపడాన్ని తప్పుబడుతున్నారు. కనిగిరి డివిజన్‌ నుంచి తప్పించి గిద్దలూరు డివిజన్‌ ఏర్పాటు చేయాలని, సాధ్యం కాకపోతే మార్కాపురం డివిజన్‌లోనే ఉంచాలని ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.


నెల్లూరుకు దూరంగా..

తిరుపతి జిల్లా పునర్విభజన మార్పులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఇపుడా హామీని నెరవేర్చకపోవడం పట్ల టీడీపీ శ్రేణులు సైతం తీవ్ర నిరాశ చెందుతున్నాయి. తొలినుంచీ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కొనసాగినందున విద్య, వైద్యం, వ్యాపార సంబంధాలు ఎక్కువ. ప్రత్యేక అనుబంధం ఉంది. గూడూరు నుంచి నెల్లూరు 36 కి.మీ. కాగా తిరుపతి 110 కి.మీ. ఎలా చూసినా తిరుపతి జిల్లాలో కొనసాగడం అసౌకర్యంగా ఉందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా.. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలు నెల్లూరు జిల్లాలోనూ, వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం నెల్లూరు పరిధిలోని కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లాలోని గూడూరు రెవిన్యూ డివిజన్‌ పరిధిలోకి చేర్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆ మూడు మండలాల ప్రజలూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలువాయి నుంచి నెల్లూరుకు 70 కి.మీ. కాగా గూడూరు 80 కి.మీ. ఇక జిల్లా కేంద్రమైన తిరుపతి ఏకంగా 160 కి.మీ. దూరంలో ఉంది. అలాగే రాపూరు నుంచి నెల్లూరు 60 కి.మీ. అయితే తిరుపతి 90 కి.మీ. సైదాపురం నుంచి నెల్లూరు 50 కి.మీ. ఉంటే తిరుపతి ఏకంగా 130 కి.మీ. దూరంలో ఉంది. ఈ 3 మండలాలనూ నెల్లూరులోనే కొనసాగించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

నెరవేరిన ఏళ్లనాటి కల

మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాలను కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల నాటి కల నేరవేరిందని అంటున్నారు. మదనపల్లె కేంద్రంగా అటు తంబళ్లపల్లె, ఇటు పీలేరు, పుంగనూరు ప్రాంతాలు కూడా మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. మదనపల్లె పట్టణంలో జనాభా 2.5లక్షలు ఉంది. ఈ పట్టణానికి కర్ణాటక సరిహద్దుగా ఉంది. తమిళనాడు సరిహద్దు కూడా చాలా దగ్గరలో ఉంది. దీనివల్ల ఈ ప్రాంతం వ్యాపార, వాణిజ్య రంగాల్లో వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిశ్రమలకూ అనుకూల వాతావరణం ఉంది. బెంగళూరు వంద కిలోమీటర్ల లోపే ఉండటం మదనపల్లెకు కలిసొచ్చే అంశం. ప్రస్తుత ప్రతిపాదిత జిల్లాలోని నియోజకవర్గాలన్నీ.. జిల్లా కేంద్రానికి 35 కి.మీ. నుంచి 50 కి.మీ. దూరంలోనే ఉన్నాయి. దీంతో జిల్లా కేంద్రానికి వివిధ పనుల మీద వచ్చే ప్రజలకు అనుకూలంగా ఉండనుంది.


ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలి

గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్న కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలో విలీనం చేయకపోవటంపై ప్రజలలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉన్నపుడు 2016-17లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 43 గ్రామ పంచాయతీలను గ్రేటర్‌ విజయవాడ పరిధిలోకి తీసుకురావటానికి ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం విజయవాడ ఎన్టీఆర్‌ జిల్లా కేంద్రంగా ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాలో మైలవరం నియోజకవర్గం మాత్రమే ఉంది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్‌ మండలం ఎన్టీఆర్‌ జిల్లాలో ఉండగా.. మిగిలిన గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపారు. పెనమలూరు పరిధిలోని పెనమలూరు, కంకిపాడు మండలాలలోని గ్రామాలు గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. గ్రేటర్‌లో విలీనం కావని తెలిసినా.. ఎన్టీఆర్‌ జిల్లాలో కలవకపోయినా.. ఈ ప్రాంతాల అభివృద్ధిపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, కేసరపల్లి వంటి ప్రాంతాలు కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ ప్రాంతాలను ఎన్టీఆర్‌ జిల్లాలో కలపకపోతే అభివృద్ది ఆగిపోతుందని ప్రజలు భావిస్తున్నారు.

కడపలోనే కొనసాగించండి

కడప జిల్లా, కడప రెవెన్యూ డివిజనులో ఉన్న సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజను, అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని ఆ రెండు మండలాల ప్రజలు ఇష్టపడటం లేదు. సిద్దవటం మండ లం కడపకు కూతవేటు దూరంలో ఉంది. మండల కేంద్రం కడపకు 22 కి.మీ. దూరంలోనే ఉంది. అన్నమయ్య జిల్లాలో చేర్చడంతో ఆ జిల్లా కేంద్రం రాయచోటికి పోవాలంటే కడపకు వచ్చి రెండు బస్సులు మారాలి. వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. రెవెన్యూ డివిజన్‌ కేంద్రం రాజంపేటకు వెళ్లాలన్నా 45 కి.మీ. ప్రయాణించాలి. అలాగే ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని కడప జిల్లా వాసులు అంగీకరించడం లేదు. రాష్ట్ర విభజన తరువాత ఒంటిమిట్ట ఆంధ్రా భద్రాద్రిగా పేరు గాంచింది. ఏటా ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరాముని కల్యాణం నిర్వహిస్తున్నారు. కడప జిల్లావాసులకు ఒంటిమిట్టతో విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని ఇష్టపడటం లేదు. ఒంటిమిట్ట మండల కేంద్రం నుంచి కడపకు 25 కి.మీ. ఉంది. అన ్నమయ్య జిల్లాకు మార్చడంతో రాయచోటికి పోవాలంటే 90 కి.మీ ప్రయాణించాలి. రెండు బస్సులు మారాలి. సిద్దవటం, ఒంటిమిట్టలను కడప జిల్లాలోనే కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.


మడకశిర ప్రజల ఆకాంక్ష.. రెవెన్యూ డివిజన్‌

కర్ణాటక సరిహద్దులో ఉన్న వెనుకబడిన ప్రాంతం మడకశిర నియోజకవర్గం. శ్రీసత్యసాయి జిల్లాలోని ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరింది. పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ నుంచి విడిపోయి.. అగళి, అమరాపురం, గుడిబండ, రొళ్ల, మడకశిర మండలాలతో ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే మడకశిరలో రక్షణ రంగానికి చెందిన మందుగుండు సామగ్రి తయారీ కంపెనీ ఏర్పాటుకు అనుమతులిచ్చారు. కల్లుమర్రి సమీపంలో రూ.7,500 కోట్లతో సోలార్‌ పార్క్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తాజాగా రెవెన్యూ డివిజన్‌కు ఆమోదం తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది.

ఒకే నియోజకవర్గం పరిధిలోకి..

పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లో ఉన్న గోరంట్లను పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లోకి, కదిరి డివిజన్‌లో ఉన్న అమడగూరును పుట్టపర్తి డివిజన్‌లోకి కలిపారు. తద్వారా ఒక నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఒకే రెవెన్యూ డివిజన్‌లోకి చేరాయి.

Updated Date - Nov 28 , 2025 | 06:18 AM