Handri Neeva Krishna Water: 7 పంపులు.. 2,532 క్యూసెక్కులు
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:57 AM
రాయలసీమ జీవనాడి హంద్రీనీవా ప్రధాన కాలువను విస్తరించి పూర్తిస్థాయి ప్రవాహ సామర్థ్యం..
హంద్రీనీవాలో కృష్ణమ్మ పరుగులు
లైనింగ్ పనులతో పెరిగిన కాలువల సామర్థ్యం
జీడిపల్లి జలాశయానికి చేరిన జలాలు
త్వరలోనే కుప్పం బ్రాంచి కెనాల్‌కు నీరు
సాకారమవుతున్న చంద్రబాబు సంకల్పం
కర్నూలు, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాయలసీమ జీవనాడి హంద్రీనీవా ప్రధాన కాలువను విస్తరించి పూర్తిస్థాయి ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెంచాలనే సీఎం చంద్రబాబు సంకల్పం సాకారం అవుతోంది. గురువారం నాటికి నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు సమీపంలో హంద్రీనీవా పంపింగ్ స్టేషన్ (పీఎస్-2) నుంచి ఏడు పంపుల ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోస్తున్నారు. 2,532 క్యూసెక్కులను లిఫ్ట్ చేస్తున్నారు. ఈ స్థాయిలో నీటిని తీసుకోవడం ఇదే ప్రథమం. శ్రీశైలం ఎగువన 40 టీఎంసీలు ఎత్తిపోసి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లోని 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో 1985-90 మధ్యలో అప్పటి సీఎం ఎన్టీఆర్ హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2004 తరువాత పనుల్లో వేగం పుంజుకుంది. 2012 నాటికి ఫేజ్-1 కింద ప్రధాన కాలువ, లిఫ్టులు, జలాశయాలు పూర్తిచేసి ట్రైల్‌రన్ వేశారు. 3,850 క్యూసెక్కులు ఎత్తిపోయాలన్నది లక్ష్యం కాగా 1,800 నుంచి 2 వేల క్యూసెక్కులకు మించి తీసుకోలేని పరిస్థితి ఉండేది. పూర్తి సామర్థ్యంతో నీటిని ఎత్తిపోయాలని 2017-18లో నాటి టీడీపీ ప్రభుత్వం రూ.1,030 కోట్లతో విస్తరణ చేపడితే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆపేసింది. మళ్లీ సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఫేజ్-1 కింద నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 0/0 నుంచి 216.300 కిలోమీటర్ల వరకు, ఫేజ్-2 కింద 216.300 కిలోమీటర్ల నుంచి చిత్తూరు జిల్లాలో 400.500 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువతోపాటు కుప్పం, పుంగనూరు బ్రాంచి కెనాల్ విస్తరణను రూ.1,970 కోట్లతో చేపట్టారు.


మార్చి 15న మొదలు పెట్టి జూలై 15 నాటికి 120 రోజుల్లో కాలువ విస్తరణలో భాగంగా మట్టి పనులు 90-95 శాతం, లైనింగ్, షాట్‌క్రెటింగ్ పనులు 45 శాతం పూర్తిచేసి రికార్డు నెలకొల్పారు. ఈ నెల 17న సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి పంపులు ఆన్ చేశారు. హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేశారు. మొదట ఒక పంపును మాత్రమే ఆన్ చేసి 336 క్యూసెక్కులు ఎత్తిపోశారు. క్రమంగా గురువారం నాటికి దానిని ఏడు పంపులకు పెంచారు. త్వరలోనే 12 పంపుల ద్వారా 3,850 క్యూసెక్కులు ఎత్తిపోసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. 10-15 రోజుల్లో శ్రీసత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లి జలాశయానికి జలాలు చేరుతాయి. అక్కడి నుంచి కుప్పం, పుంగనూరు బ్రాంచి కాలువకు కూడా నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హంద్రీనీవా ప్రాజెక్టు అనంతపురం సీఈ నాగరాజు, కర్నూలు సర్కిల్-1 ఎస్‌ఈ పాండురంగయ్య తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News