Kakani Govardhan Reddy: తెలియదు.. సంబంధం లేదు.. మా లాయర్‌ను అడగండి
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:13 AM
‘నాకు తెలియదు... నాకు సంబంధం లేదు... మా లాయర్‌ను అడగండి..!’ తొలిరోజు పోలీసుల విచారణలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పిన సమాధానాలు ఇవీ.
కాకాణి డొంక తిరుగుడు జవాబులు
తొలిరోజు 2గంటలకు పైగా విచారణ
మరో 2 రోజులు కస్టడీలోనే మాజీ మంత్రి
నెల్లూరు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ‘నాకు తెలియదు... నాకు సంబంధం లేదు... మా లాయర్‌ను అడగండి..!’ తొలిరోజు పోలీసుల విచారణలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పిన సమాధానాలు ఇవీ. పోలీసులు, రెవెన్యూ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఈ జవాబులనే మార్చి మార్చి చెప్పినట్లు తెలిసింది. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో క్వార్ట్‌జ అక్రమ తవ్వకాల కేసులో కాకాణిని జిల్లా కేంద్ర కారాగారం నుంచి వెంకటాచలం మార్గంలో కృష్ణపట్నం పోర్టు స్టేషన్‌కు శుక్రవారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2గంటలకు పైగా సాగిన ఈ విచారణలో పలు అంశాలపై ఆయన్ను ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారా, అక్రమంగా క్వార్ట్‌జని తరలించి అమ్ముకున్నారా వంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా కాకాణి సూటిగా సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ‘నాకు సంబంధం లేదు. నాకేమీ తెలియదు’ అంటూ క్లుప్తంగా జవాబిచ్చినట్లు సమాచారం. ‘మీరే సూత్రధారి అని మీ అనుచరులే చెబుతున్నార’ని అడిగినా తనకు సంబంధమే లేదని, వారినే అడగండంటూ కాకాణి బదులిచ్చారు. సాయంత్రం 5 గంటలకు పూర్తయిన విచారణ శనివారం ఉదయం మళ్లీ కొనసానుంది. కాగా, కాకాణిని మూడు రోజులపాటు కృష్ణపట్నం పోర్టు స్టేషన్‌లోనే ఉంచనున్నారు.