Share News

TDP Mahanadu 2025: పార్టీ పనైపోయిందన్న వారి పనే అయిపోయింది: సీఎం చంద్రబాబు నాయుడు

ABN , Publish Date - May 27 , 2025 | 12:12 PM

కడప మహానగరం వేదికగా మహానాడు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జెండా మోస్తున్న కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన పేర్కొన్నారు.

TDP Mahanadu 2025: పార్టీ పనైపోయిందన్న వారి పనే అయిపోయింది: సీఎం చంద్రబాబు నాయుడు
CM Chandrababu in Kadapa Mahanadu

కడప, మే 23: తొలిసారి దేవుని గడప కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సారి మహానాడు చరిత్ర సృష్టించబోతోందని ఆయన స్పష్టం చేశారు. కడప మహానగరం వేదికగా మంగళవారం మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఈ సభలో పార్టీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకుగానూ 7 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు ఆయన సూచించారు.


కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని పేర్కొన్నారు. అంతేకాదు.. అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు. ఇక ప్రశ్నించిన కార్యకర్తలను పొట్టన బెట్టుకున్నారని ఆయన తెలిపారు. పసుపు సింహం చంద్రన్నను దారుణంగా చంపారన్నారు. అలాగే ఎంతో మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని వివరించారు. కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీ కార్యకర్తల త్యాగాలను వృథా కానివ్వమని ఈ సందర్భంగా ఆయన కేడర్‌కు భరోసా ఇచ్చారు.


తన పాదయాత్ర నుంచి లోకేష్‌ యువగళం వరకు.. కార్యకర్తల్లో అదే స్ఫూర్తి, అదే పోరాట పటిమ ఉందన్నారు. జెండా మోస్తున్న కార్యకర్తలే.. టీడీపీ బలమని ఆయన అభివర్ణించారు. తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పని చేస్తుందని స్పష్టం చేశారు. పటేల్‌ - పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం తదితర అంశాలు తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైనాయని వివరించారు. అలాగే రూ.2 కిలో బియ్యం, సబ్సిడీ కరెంట్‌ కూడా ఈ పార్టీనే తీసుకు వచ్చిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలు, వర్గాల అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని ఆయన వెల్లడించారు.


గతంలో విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పాలన అంటే వేధింపులే అన్నట్లుగా గతంలోని పాలకులు వ్యవహరించారన్నారు. తెలుగుదేశంతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీలను అధికారంలో భాగస్వాములం చేశామన్నారు. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని చెప్పారు. ఇక ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడ్డామని స్పష్టం చేశారు. జవాబుదారీ వ్యవస్థను దేశానికే పరిచయం చేశామన్నారు. భావితరాల భవిష్యత్‌ కోసం కార్యక్రమాలు రూపకల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రం ఫస్ట్‌ అనేదే టీడీపీ నినాదమని ఆయన పేర్కొన్నారు.


కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇచ్చి సంక్షేమాన్ని అందిస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పార్టీ ప్రస్థానం సాగుతోందని తెలిపారు. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధికి టీడీపీనే ట్రెండ్‌ సెట్టర్‌ అని ఆయన స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేశామని చెప్పారు. ఇక 2047 నాటికి జీరో పావర్టీ సాధిస్తామని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గిస్తామన్నారు. అందరూ ఆరోగ్యం, ఆనందంగా ఉండాలన్నదే తమ విధానమని తెలిపారు.


రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీగా పుట్టి.. జాతీయ స్థాయిలో ఎదిగామన్నారు. పార్టీ పనైపోయిందన్న వారి పనే అయిపోయిందన్నారు. ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కున్నామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నీతి, నిజాయితీకి టీడీపీ బ్రాండ్‌ అని ఆయన అభివర్ణించారు.


ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కో ఇటుక పేరుస్తూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నామన్నారు. 2024లో ఏపీ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చాయని తెలిపారు. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. 2024 ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో ఆశలు చిగురించాయని చెప్పారు.


ఇక వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ తమ విధానమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదన్నారు. ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. నేరస్తులు ఎక్కడున్నా వారిని వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు ప్రకటించారు.


వైసీపీ అవినీతి, అక్రమాలపై రాజీ లేని పోరాటం చేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతిపరులను తరిమేశారని తెలిపారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యతను మనకు ప్రజలు అప్పగించారన్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఒక గేమ్‌ ఛేంజర్‌‌గా ఆయన అభివర్ణించారు. ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ చేపడతామన్నారు. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలతో కలిపి 3 విడతల్లో రూ.20 వేలు అందేస్తామని తెలిపారు.


ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రానికి ఆయన సూచించారు. డిజిటల్‌ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదని.. వాటి రద్దుతోనే అవినీతిని అరికట్టగలమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ప్రాజెక్టులు ప్రారంభించి.. పూర్తి చేసిన పార్టీ టీడీపీని గుర్తు చేశారు. 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్‌ నుంచి డ్రిప్‌ ఇరిగేషన్‌ను రాష్ట్రానికి తీసుకు వచ్చామని వివరించారు. గత ఐదేళ్లలో ఒక్క పైసా కూడా ఇరిగేషన్‌కు ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. ఈ ఏడాదే హంద్రీనీవా పనులు పూర్తి చేసి.. నీళ్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ రైతులను బలోపేతం చేసేలా.. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో టాటా ఇన్నోవేషన్‌ హబ్స్‌ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతి ముందు ఉండాలంటే.. టీడీపీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భోజనం మెనూ అదుర్స్.. చాలా కాలం తర్వాత..

ఎన్‌కౌంటర్‌లో మరో టాప్ మావోయిస్ట్ కమాండర్ హతం

For AndhraPradesh News and Telugu News

Updated Date - May 27 , 2025 | 12:54 PM