Share News

AP News: వైఎస్ షర్మిల సంచలన ప్రెస్ మీట్.. జగన్ గురించి నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడి..

ABN , Publish Date - Feb 07 , 2025 | 09:38 PM

ఆంధ్రప్రదేశ్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై చేసిన కుట్రలు సాయిరెడ్డి చెప్తుంటే విని కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి తెలిపారు. జగన్ తనపై చేసిన అరాచకాలు, తన క్యారెక్టర్‌ను కించపరిచేలా చేయించిన వ్యాఖ్యలు తెలుసుకుని నిర్ఘాంతపోయినట్లు చెప్పుకొచ్చారు.

AP News: వైఎస్ షర్మిల సంచలన ప్రెస్ మీట్.. జగన్ గురించి నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడి..
APCC Chief YS Sharmila Reddy

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy)ని కలిసి అనేక అంశాలు చర్చించినట్లు ఆమె తెలిపారు. తనపై అన్న జగన్ చేసిన కుట్రలు సాయిరెడ్డి చెప్తుంటే విని కన్నీళ్లు పెట్టుకున్నట్లు షర్మిల వెల్లడించారు. జగన్ తనపై చేసిన అరాచకాలు, తన క్యారెక్టర్‌ను కించపరిచేలా చేయించిన వ్యాఖ్యలు తెలుసుకుని నిర్ఘాంతపోయినట్లు చెప్పుకొచ్చారు. చట్టప్రకారం తనకు రావాల్సిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులను జగన్ ఎలా దోచేయాలని చూశారో తెలిసి తీవ్ర మనోవేదనకు గురైనట్లు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతూ.. "విజయసాయిరెడ్డిని కలిసి చాలా అంశాలు మాట్లాడాం. జగన్ మోహన్ రెడ్డి వల్ల పడిన ఇబ్బందుల గురించి ఆయన చెప్పారు. సాయిరెడ్డి అనేక విషయాలు చెప్పినప్పటికీ నేను కేవలం నా బిడ్డలకు సంబంధించిన విషయాలు మాత్రమే చెబుతున్నా. వైఎస్ ఆస్తులకు సంబంధించి షేర్స్ తనకే చెందాలంటూ జగన్.. నాపై, తల్లి విజయలక్ష్మిపై కేసు వేశారు. అందుకే ఆస్తుల గురించి వైఎస్ ఆనాడు అన్న మాటలు గతంలో మీడియాకు చెప్పా. అప్పుడు విజయసాయిరెడ్డితో జగనే ప్రెస్ మీట్ పెట్టించి నా మాటలు అబద్ధాలని చెప్పించారు. ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాటలు అబద్ధమని మా అమ్మ విజయలక్ష్మి లేఖ రాసి మరీ చెప్పారు.


ఆ తర్వాత కూడా విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారంట. ఆయన అంగీకరించకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. అనంతరం జగన్ మళ్లీ విజయసాయిరెడ్డిని పిలిపించారు. 40 నిమిషాలపాటు జగనే స్వయంగా విజయసాయిరెడ్డికి డిక్టేట్ చేశారంట. ఎలా చెప్పాలి, నాపై ఏం మాట్లాడలో ఆయనే మొత్తం వివరించారంట. ఆ తర్వాత సాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిరెడ్డిపై ఒత్తిడి చేశారు. నా పరువు పోతుందని.. వదిలేయండని సాయిరెడ్డి చెప్పినా జగన్ ఊరుకోలేదట. ఏ అబద్ధాలు ఎలా చెప్పాలో జగన్ చెబితే విజయసాయి రెడ్డి రాసుకున్నారంట.


ఈ విషయాలను విజయసాయి రెడ్డే నాకు స్వయంగా చెప్పారు. ఇవన్నీ పల్లు పోకుండా సాయిరెడ్డి చెప్పిన మాటలే. ఈ విషయాలు విని నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఇదీ జగన్ మోహన్ రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్. వైఎస్ బిడ్డ, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా జగన్ దిగజారిపోయి వ్యవహరించారు. నా క్యారెక్టర్‌పై ఇంత నీచంగా మాట్లాడించారు. ఇటీవల ఆయన క్యారెక్టర్ గురించి పెద్దపెద్ద డైలాగులు చెబుతున్నారు. అసలు క్యారెక్టర్ అంటే ఏంటో జగన్ మరచిపోయారు. సొంత మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని ఇంత కుట్రలు చేశారు. జగన్, అతని భార్య బైబిల్ ముందు కూర్చుని ఎంత దిగజారిపోయారో ఆలోచన చేయాలి. నా పిల్లలకు మీ ముఖం చూపించే ధైర్యం ఉందా?" అంటూ షర్మిల ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 07 , 2025 | 10:18 PM