TDP Mahanadu 2025: మూడు రోజుల్లో మహానాడు
ABN , Publish Date - May 24 , 2025 | 03:51 AM
కడపలో మే 27 నుంచి ప్రారంభమయ్యే టీడీపీ మహానాడుకు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడు రోజుల పాటు పార్టీలో కీలక అంశాలపై తీర్మానాలు, బహిరంగ సభలు, ప్రజా సమస్యలపై చర్చలు జరగనున్నాయి.
అంబరాన్నంటేలా టీడీపీ పసుపు పండుగ
కడపలో ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు
23 వేల మందితో ప్రతినిధుల సమావేశం
తొలి రోజు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి
రెండో రోజు కూటమి ఏడాది విజయాలపై చర్చ
మూడో రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ
సంక్షేమం, అభివృద్ధిపై 14 ముసాయిదా తీర్మానాలు
రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక చర్చకు నిర్ణయం
కడపలోనే మంత్రుల మకాం.. పనుల పర్యవేక్షణ
అమరావతి/కడప, మే 23(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప వేదికగా నిర్వహించే మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తొలి రోజు.. పార్టీ ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, విధివిధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కేడర్‌కు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు ప్రతినిధుల సభతోపాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై చర్చించనున్నారు. మూడో రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కన్వీనర్‌గా ఉన్న మహానాడు తీర్మానాల కమిటీ కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మినీ మహానాడుల నుంచి వచ్చిన తీర్మానాలతోపాటు పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలపై గత నాలుగైదు రోజులుగా తీర్మానాల కమిటీ కసరత్తు చేసింది. ఎప్పటికప్పుడు చర్చల వివరాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలియజేశారు. సుమారు 16 తీర్మానాలను మహానాడులో పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తీర్మానాల కమిటీలో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మహానాడు తీర్మానాలపై చర్చలు తుది దశకు వచ్చాయన్నారు. తీర్మానాలపై చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఇప్పటికే పలు దఫాలు చర్చించారని, శనివారం మరోసారి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తీర్మానాలపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీ నుంచి 13 లేదా 14 ముసాయిదా తీర్మానాలు ఉంటాయని, తెలంగాణ నుంచి 5 తీర్మానాల వరకు ఉంటాయని, ఉమ్మడిగా 4 తీర్మానాలు ఉంటాయని వివరించారు.
సీమ అభివృద్ధిపై ప్రత్యేక చర్చ
రాయలసీమ అభివృద్ధి కోసం టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ చేసిన కృషిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. 2014 నుంచి సీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేశారు. కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, ఓర్వకల్ హబ్, కియా, విండ్, సోలార్ పవర్ యూనిట్ల ద్వారా లక్షల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు టీడీపీ కృషి చేస్తోంది. హార్టికల్చర్, పరిశ్రమలు, డెయిరీల అభివృద్ధి తదితరవాటన్నింటిపైనా చర్చించి.. ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్
ఏడాది పాలనలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పింఛన్ల పెంపు, ఉచితంగా 3 సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ.. తదితర వాటిపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతోపాటు మేనిఫెస్టో హామీల అమలుపైనా రెండో రోజు చర్చించనున్నారు.
పార్టీ సంస్థాగత అంశాలపై..
మహానాడు తొలిరోజే పార్టీ సభ్యత్వం, సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. క్లస్టర్ యూనిట్, బూత్, గ్రామ, వార్డు, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల ప్రాధాన్యతలను వివరించనున్నారు. ఆయా కమిటీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నాయకులు, కార్యకర్తలు తమ అనుభవాలను పంచుకోనున్నారు.
ప్రభుత్వ కొనసాగింపుపై!
రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం నిరంతరాయంగా అధికారంలో కొనసాగడం వల్ల జరిగే అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలను మహానాడులో నేతలు వివరించనున్నారు. గుజరాత్‌లో గత మూడు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఆ రాష్ట్రంలో సుస్ధిర అభివృద్ధి సాధ్యమైంది. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. మన రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం కొనసాగింపు వల్ల ‘స్వర్ణాంధ్ర’ కల సాకారానికి మార్గం సుగమం అవుతుందని నేతలు వివరించనున్నారు.
‘మై టీడీపీ యాప్’
పార్టీ, ప్రజలకు మధ్య అనుసంధానానికి మహానాడు వేదిక ద్వారా ‘మై టీడీపీ యాప్’ను ఆవిష్కరించనున్నారు. ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడి వరకు వారి పనితీరును బేరీజు వేయనున్నారు. తద్వారా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించనుంది. అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ యాప్ ఉపయోగపడనుంది.
మూడో రోజు భారీ సభ
2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం జరుగుతున్న కడప మహానాడును భారీ ఎత్తున నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కడపలోని 10 అసెంబ్లీ సీట్లలో 7 స్థానాలను టీడీపీ కైవశం చేసుకుంది. మహానాడు చివరి రోజైన 29న సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయనున్నారు. ఈ మేరకు రవాణా కోసం ప్రైవేటు, ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. బహిరంగసభకు 50వేలకు పైగా వాహనాల్లో ప్రజలు వస్తారని అంచనా. సుమారు 150 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయించారు.
మంత్రుల పర్యవేక్షణ
మహానాడు పనుల పర్యవేక్షణకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు 2 రోజులుగా కడపలోనే మకాం వేశారు. శుక్రవారం మంత్రులు అనగాని, రాంప్రసాద్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.
పసుపుదళానికి నూతనోత్తేజం!
మహానాడులో 6 కీలక అంశాల ప్రతిపాదన
తెలుగుదేశం పార్టీని మరో 4 దశాబ్దాలపాటు నూతనోత్తేజంతో నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలకు కడప మహానాడు వేదికగా నిలవనుంది. పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పార్టీలో కీలక మార్పులు తీసుకురావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆరు కీలక అంశాలను మహానాడులో ప్రతిపాదించనున్నారు. ఆ ప్రతిపాదనలు ఇవీ..
1. తెలుగుజాతి.. విశ్వఖ్యాతి: తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు.. తెలుగువారు ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా నంబర్-1గా ఎదగాలనే లక్ష్యంతో ‘నా తెలుగు కుటుంబం’ ఐడియాలజీని ప్రతిపాదించనున్నారు.
2. స్త్రీ శక్తి: మహిళా సాధికారత, మహిళా శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో ఈ వర్గానికి మద్దతు ఇవ్వనున్నారు. రానున్న రోజుల్లో మహిళలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ‘స్త్రీ శక్తి’ని మరింత బలోపేతం చేసి ఉన్నతస్థాయికి తీసుకెళ్లనున్నారు.
3. సోషల్ రీఇంజనీరింగ్: పేదరికం లేని సమాజం చూడాలన్న లక్ష్యంతో ‘పీ-4’ను అమలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్యాయంపై ఐడియాలజీని రూపొందించనున్నారు. ప్రతి వర్గానికీ న్యాయం చేసేలా ‘సోషల్ రీఇంజనీరింగ్’ చేయనున్నారు.
4. యువగళం: పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన చర్యలు, ఐడియాలజీపై చర్చించనున్నారు. యువతకు అవకాశాలు సృష్టించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతర ప్రణాళిక అమలు చేస్తారు.
5. అన్నదాతకు అండ: ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, సాంకేతికంగా రైతును బలోపేతం చేయడం, సబ్సిడీలు ఇచ్చి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పంటలు పండించేలా చేయడంపై దృష్టి పెట్టనున్నారు. ‘అన్నదాతకు అండ’ అనే విధానాన్ని విస్తృతపరచనున్నారు.
6. కార్యకర్తే అధినేత: టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం, వారికి చేయూత అందించేలా ఐడియాలజీ రూపొందించనున్నారు. కార్యకర్తే అధినేత అనేది తెలుగుదేశం పార్టీ నినాదం, విధానంగా ఉండబోతోంది. సీనియర్లను గౌరవించడం, యువతను ప్రోత్సహించడం, కష్టపడేవారికి మద్దతుగా నిలవడం వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నారు.
ఎల్లుండికల్లా పనులు పూర్తి!
మహానాడు వేదిక పనులు శరవేగంగా సాగుతున్నాయి. కడప నగర శివారులోని రింగు రోడ్డు సమీపాన పబ్బాపురం వద్ద 125 ఎకరాల స్థలంలో మహానాడు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలి రెండు రోజులు నిర్వహించే ప్రతినిధుల సభకు 23 వేల మంది హాజరు కానున్నారు. ఆ వేదిక పనులు చివరి దశకు చేరుకున్నాయి. చివరి రోజున 5 లక్షల మందితో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆ వేదిక పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు కడపలోనే బస చేయనున్నారు. భోజనశాల, ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం పనులన్నీ 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. సోమవారం నాటికి పనులు పూర్తవుతాయని నాయకులు తెలిపారు. బహిరంగసభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ అభిమానులు హాజరు కానుండడంతో నెట్‌వర్క్‌కు ఇబ్బంది లేకుండా ఎయిర్‌టెల్, జియో, బీఎ్‌సఎన్‌ఎల్ ఇతర కంపెనీలకు చెందిన 4 మొబైల్‌టవర్లను మైదానంలో ఏర్పాటు చేశారు.
14 ముసాయిదా తీర్మానాలు
1. ఎన్డీయే కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే సాధించిన ఘనవిజయాలు.
2. శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం.(నదుల అనుసంధానం, బనకచర్లకు గోదావరి జలాలు)
3. ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ.(ప్రజారాజధాని అమరావతి నిర్మాణం. పట్టణ, గ్రామీణాభివృద్ధి, పెట్టుబడులతో వికేంద్రీకరణ. 175 నియోజకవర్గాలకు 175 పారిశ్రామిక పార్కులు. జగన్ పాలనలో దోపిడీకి గురైన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై దృష్టి)
4. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు.
5. మహిళ, యువత సంక్షేమానికి పెద్దపీట.
6. సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం.
7. కట్టుదిట్టంగా శాంతిభద్రతలు.
8. చంద్రన్న విజన్‌తో సంక్షేమ రాజ్యం. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం.
9. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కేంద్రంతోడ్పాటు.
10. పేదరికం లేని సమాజ నిర్మాణ సంకల్పంతో ‘పీ-4’.
11. సాకారమైన విజన్ 2020.. స్వర్ణాంధ్ర విజన్-2047 సాధన దిశగా అడుగులు.
12. విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు.
13. విపక్ష నేతగా విఫలమైన జగన్.
14. సహజ వనరుల పరిరక్షణ, అక్రమార్కులపై చర్యలు.
ఉమ్మడి తీర్మానాలు
1. తెలుగువారి చరిత్రలో ఎన్టీఆర్ ప్రత్యేకత.
2. తెలుగువారి చరిత్రలో చంద్రన్న మైలురాళ్లు/ముద్ర.
3. అమరులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఘన నివాళి.
4. కార్యకర్తల సంక్షేమం.