Peoples Judge Ramana: ప్రజల న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
ABN , Publish Date - May 08 , 2025 | 05:03 AM
జస్టిస్ ఎన్వీ రమణ ప్రజల మధ్య ఉండే న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థలో విలక్షణ సేవలు అందించారని జస్టిస్ గవాయ్ ప్రశంసించారు. రాజ్యాంగ నైతికత, ప్రజల న్యాయసహాయంపై తన దృష్టిని కేంద్రీకరించానని జస్టిస్ రమణ అన్నారు
ఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి: జస్టిస్ గవాయ్
ప్రజల విశ్వాసమే న్యాయవ్యవస్థకు ఊపిరి: జస్టిస్ రమణ
న్యూఢిల్లీ, మే 7(ఆంధ్రజ్యోతి): ‘జస్టిస్ ఎన్వీ రమణ ప్రజల న్యాయమూర్తి. న్యాయమూర్తిగా ప్రజలకు దూరం కాకుండా.. వారితో కలిసిపోయి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేశారు’ అని కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగాల సంకలనం ‘నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్’ పుస్తకాన్ని బుధవారం గవాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను, జస్టిస్ రమణ మరికొందరు న్యాయమూర్తులం.. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చామని అందుకే ప్రజల సమస్యలు తమకు తెలుసన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా తొమ్మిది మంది మహిళ న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు నియమించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ నిత్యం సమాజం గురించే ఆలోచించేవారని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్ ప్రశంసించారు. జస్టిస్ రమణను ప్రజా స్నేహితుడిగా విక్రమ్‌నాథ్ అభివర్ణించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ న్యాయవ్యవస్థ అంటే వివాదాలను పరిష్కరించే సంస్థ కాదని, అది రాజ్యాంగ నైతికతకు చిహ్నమని అన్నారు. న్యాయవ్యవస్థలో అన్ని వర్గాలకు స్థానం కల్పించడం, భారతీయ భాషలను కోర్టు విచారణలో భాగం చేయడం, ప్రజలకు న్యాయసహాయం అందేలా చూడడం వంటి వాటిపై తాను దృష్టి కేంద్రీకరించానని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్
ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..
For More AP News and Telugu News