Janasena Party : పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:35 AM
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో మూడు రోజులపాటు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.

మార్చి 12,13,14 తేదీల్లో నిర్వహణ
అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో మూడు రోజులపాటు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. శుక్రవారం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదన మేరకు మేరకు మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ సిద్ధాంతాలు, పవన్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరించడంతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని కమిటీ భావించింది. ఇందుకోసం పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనల, సలహాలు తీసుకోవాలని, ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. మార్చి 12 ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం అతిథులతో, 14న బహిరంగ సభ నిర్వహిస్తారు.
అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికే ప్రాధాన్యం
పార్టీ, కేడర్ పరిస్థితిపై పీఏసీలో లోతైనచర్చ జరిగింది. కొంతమంది నేతలు క్షేత్రస్థాయిలో కేడర్ అభిప్రాయాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నిర్మొహమాటంగా వ్యక్తీకరించిన ఆ అభిప్రాయాలను పార్టీసైతం అంగీకరించింది. ‘అధ్యక్షునితో పాటు పార్టీలో కీలకమైన వారంతా కేడర్, పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల ముందు జిల్లాల్లో కేడర్ మొత్తం ఉత్సాహంతో పని చేసింది. కూటమి పార్టీల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పార్టీ కంటే ప్రభుత్వానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాం. దీనివల్ల జిల్లాల్లో కేడర్ తీవ్ర నిరాశలో ఉంది. ఇప్పుడు మూడురోజుల పాటు పిఠాపురంలో ప్లీనరీ నిర్వహిస్తే ఆశించిన స్థాయిలో కేడర్ రాకపోవచ్చు. గ్రామ, మండల స్థాయిల్లోనే కాదు... జిల్లా స్థాయిలోనూ కూటమిలో జనసేన పార్టీ నాయకులకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదు’ అని కుండ బద్దలు కొట్టారు.
‘పార్టీ అధ్యక్షుడు ప్రతి నెలా కేడర్ కోసం సమయం కేటాయిస్తేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కూటమి నాయకులు కూడా జనసేనలోని జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులకు గుర్తింపు ఇస్తారు. ముందుగా పార్టీ కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. నెలల తరబడి పార్టీ కార్యాలయంలోకి కేడర్‌కు ఎంట్రీ లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి’ అని వారు విస్పష్టంగా తెలిపారు. క్షేత్రస్థాయి నేతలు వ్యక్తం చేసిన పై అభిప్రాయాలతో అగ్రనాయకత్వమూ ఏకీభవించింది. అయితే వేటికీ సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోయిందని సమాచారం.