Krishna Water Dispute : కృష్ణా జలాలపై జగన్ మొద్దు నిద్ర
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:42 AM
కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించేలా 2023లో కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మొద్దు నిద్ర పోయారు.

నాడు జగన్ మొద్దు నిద్ర
పునఃసమీక్ష కోరని వైనం
నేడు కూటమి సర్కారుదే తప్పంటూ రోత రాతలు
ఏవగించుకుంటున్న నిపుణులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించేలా 2023లో కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మొద్దు నిద్ర పోయారు. ‘ఇదేంటి? ఇంత అన్యాయం చేస్తున్నారేంటి?’ అని మాట వరసకు కూడా అనలేదు. దీంతో కేంద్ర నిర్ణయం మేరకు బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అయితే, అధికారం కోల్పోయాక జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తొచ్చాయి. ఇప్పుడు గుండెలు బాదుకుంటూ.. తన హయాంలో జరిగిన దానిని కూడా కూటమి ప్రభుత్వానికి అంటగడుతూ ఆయన విమర్శలు గుప్పించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్.. కేంద్ర గెజిట్‌లోని సెక్షన్ 3 ప్రకారం వాటాలపై వాదనలు వింటామని గురువారం స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుందో లేదో.. కృష్ణా జలాల్లో హక్కులు సాధించేశామంటూ తెలంగాణ నేతలు చేసుకున్న ప్రచారానికి జగన్ రోత పత్రిక వంతపాడటం మొదలుపెట్టింది. ట్రైబ్యునల్ ఆదేశాలపై తప్పంతా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. అయితే, వాస్తవానికి వైసీపీ హయాంలోనే కేంద్రం గెజిట్ విడుదల చేసింది. కానీ, అప్పట్లో జగన్ నోరుమెదపలేదు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై పన్నెత్తు మాట అనలేదు. సుప్రీం కోర్టులో కేసు వేసినా, బలమైన వాదనలు వినిపించలేదు. ఈ విషయాన్ని జలవనరుల రంగానికి చెందినవారు గుర్తు చేస్తున్నారు.