AP News: అవి ముమ్మాటికీ జగన్ హత్యలే.. మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Dec 29 , 2025 | 09:55 PM
జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి 29 మంది చనిపోయిన ఘటన ముమ్మాటికీ జగన్ రెడ్డి హత్యలేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనంతా కల్తీ, దోపిడీ,
అమరావతి, డిసెంబర్ 29: జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి 29 మంది చనిపోయిన ఘటన ముమ్మాటికీ జగన్ రెడ్డి హత్యలేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనంతా కల్తీ, దోపిడీ, అవినీతే.2019-24 మధ్య కాలంలో జరిగినన్ని అక్రమాలు ప్రపంచంలో ఎక్కడా ఏ నాయకుడూ చేసి ఉండడు. మద్యం వ్యాపారం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారు. అడ్డగోలుగా రేట్లు పెంచి ప్రజల్ని కల్తీకి అలవాటు చేశారు. దీంతో ధరల బాదుడుతో ప్రజలు నాటు సారాకు అలవాటు పడ్డారు. అక్కడ సారా వ్యాపారం చేసింది కూడా వైసీపీ నేతలేనన్నారు.
సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. ‘జగన్ రెడ్డి పాలనలో జరిగిన అక్రమాలన్నీ విచారణలో బయటకొస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో 29 మంది పేద కుటుంబాలను నాశనం చేశాడు. కల్తీ సారా వలనే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతుంటే.. కనీసం విచారణ కూడా జరపలేదు. పైగా అవన్నీ సాధారణ మరణాలేనని, నెలకు సగటున 90 మంది వరకు చనిపోతున్నారంటూ అసెంబ్లీలో సమాధానం చెప్పడం జగన్ రెడ్డి నీతి మాలిన రాజకీయానికి నిదర్శనం. నాటి కేసును మసిపూసి మారేడు కాయ చేయాలని జగన్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ.. సిట్ విచారణలో అన్నీ బయటకొస్తున్నాయి’ అని అన్నారు.
‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి తీసుకొచ్చిన కల్తీ బ్రాండ్లను నిషేధించి, నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ధరలు అందుబాటులో ఉంచాం. ప్రజలకు అందుబాటులో ఉండేలా రూ.99 బ్రాండ్లు తీసుకొచ్చాం. అదే సమయంలో మద్యం క్వాలిటీకి ప్రాధాన్యమిచ్చి 13 స్థాయిల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. కల్తీని నిరోధించడం కోసం సురక్ష యాప్ తీసుకొచ్చాం. ప్రతి బాటిల్ ట్రేస్ చేసేలా వ్యవస్థను రూపొందించాం. జగన్ రెడ్డి అక్రమాలన్నీ బయటకొస్తుండడంతో.. కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేయాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. గత ఐదేళ్లు ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేసిన అనుభవంతో మళ్లీ తయారు చేసి, ఆ నెపాన్ని ప్రభుత్వంపై వేయాలనుకున్నారు. చివరికి వారే అడ్డంగా దొరికి జైలుపాలయ్యారు. తాజాగా నెల్లూరులో ఒక వృద్ధుడితో ఐదు మద్యం బాటిళ్లు కొనుగోలు చేయించి, అతనికి తెలియకుండా వీడియోలు తీసి, బెల్టు షాపుల కోసం అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేశారు. చివరికి కొనుగోలు చేసిన వృద్ధుడే వచ్చి కొంత మంది డబ్బులిచ్చి కొనుగోలు చేయించారని చెప్పడంతో మరో కుట్ర బయటపడింది. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు జగన్ రెడ్డి అండ్ కో కుట్రలు చేయడం సిగ్గుచేటు. తప్పు చేసినోళ్లను వదిలిపెట్టబోం. తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం’ అంటూ వైసీపీ నాయకులకు మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read:
Picture Puzzle: మీ ప్రతిభకు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి
New Year Celebrations: హ్యాంగోవర్ నుంచి ఇలా బయటపడండి..
Revanth Reddy Tirumala visit: తిరుమల చేరుకున్న రేవంత్ రెడ్డి.. స్వాగతం పలికిన ఏపీ మంత్రులు..