Share News

Passport Petition : ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్‌కు ఎదురుదెబ్బ

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:14 AM

మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాను విదేశాలకు వెళ్లడానికి వీలుగా పాస్‌పోర్టు ఇప్పించాలని, దీనిపై పాస్‌పోర్టు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Passport Petition : ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్‌కు ఎదురుదెబ్బ

  • ‘పాస్‌పోర్టు’ పిటిషన్‌ కొట్టివేత న్యాయస్థానం

  • గడువు ముగిసినందున కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశం

విజయవాడ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాను విదేశాలకు వెళ్లడానికి వీలుగా పాస్‌పోర్టు ఇప్పించాలని, దీనిపై పాస్‌పోర్టు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. విదేశాల్లో ఉన్న తన కుమార్తెల జన్మదిన వేడుకలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని జగన్‌ గత ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐదేళ్ల కాలానికి పాస్‌పోర్టు ఇవ్వాలని సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం.. పాస్‌పోర్టును ఏడాది మాత్రమే పునరుద్ధరిస్తామని, జగన్‌ తమ ముందు హాజరై రూ.20 వేల స్వీయ పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దీనిని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. ఆ షరతులను పాక్షికంగా సవరించారు. ఐదేళ్ల పాటు పాస్‌పోర్టు జారీకి వీలుగా ఎన్‌వోసీ జారీ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించారు. అయితే సదరు ఎన్‌వోసీ పొందేందుకు జగన్‌ ప్రత్యేక కోర్టు ముందు హాజరై స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనని తేల్చిచెప్పారు.


గత ఏడాది సెప్టెంబరు 20వ తేదీతో జగన్‌ పాస్‌పోర్టు గడువు ముగిసిపోయింది. దీనిపై వారం క్రితం ఆయన తరపున న్యాయవాది వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధుల కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. పాస్‌పోర్టు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది తెల్లాప్రగడ సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. జగన్‌ పాస్‌పోర్టుకు 2024 సెప్టెంబరులోనే గడువు ముగిసిందని.. గడువు తీరే తేదీకి ఆరు నెలలకు ముందే పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవలసి ఉందని గుర్తుచేశారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి ఎస్‌.శ్రీదేవి.. పాస్‌పోర్టు కోసం ఆ కార్యాలయంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశిస్తూ జగన్‌ పిటిషన్‌ను కొట్టివేశారు.


  • స్వీయ పూచీకత్తు ఇవ్వడానికి.. ప్రత్యేక కోర్టుకు వెళ్లనక్కర్లేదు!

  • పాస్‌పోర్టుకు ఎన్‌వోసీ జారీపై జగన్‌ వాదనలు

  • హైకోర్టులో పిటిషన్‌.. లంచ్‌మోషన్‌గా విచారణ

పాస్‌పోర్టు మంజూరు కోసం నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ విషయంలో తమ ముం దు హాజరై రూ.20 వేల స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనని స్పష్టం చేస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాజీ సీఎం జగన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తూ సోమవారం ఆదేశాలిచ్చా రు. మంత్రి పి.నారాయణ వేసిన పరుపు నష్టం కేసులో విజయవాడ ప్రత్యేక కోర్టు ముందు హాజరు నుంచి తనకు హైకోర్టు మినహాయింపు ఇచ్చినప్పటికీ.. పాస్‌పోర్టు మంజూరు నిమిత్తం అవసరమైన ఎన్‌వోసీ జారీ విషయంలో తమ ముందు హాజరై రూ.20 వేల స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనని విజయవాడ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి సోమవారం లంచ్‌మోషన్‌గా స్వీకరించారు. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.


పిటిషనర్‌కు ఐదేళ్ల పాటు పాస్‌పోర్టు జారీకి వీలుగా ఎన్‌వోసీ జారీ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టును హైకోర్టు ఆదేశించిందన్నారు. ఆ కోర్టు ముందు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఇదే కోర్టు ఉత్తర్వు లు ఇచ్చిందని తెలిపారు. ఈ నేపఽథ్యంలో జగన్‌ స్వయంగా హాజరై పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. అయితే స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనని హైకోర్టు అనాలోచితంగా ఆదేశాలిచ్చిందని తెలిపారు. జగన్‌ కుమార్తె లండన్‌లో ఉన్నత చదువులు పూర్తి చేశారని.. ఈ నెల 16న ఆమె స్నాతకోత్సవానికి ఆయ న హాజరుకావలసి ఉందని.. స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేకుండా ఎన్‌వోసీ జారీ చేసేలా ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. ఎన్‌వోసీ జారీకి ప్రత్యేక కోర్టు ముందు హాజరై స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిర్వీర్యం చేసేందుకే జగన్‌ ఈ వ్యాజ్యం వేశారన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 04:18 AM