జగన్‌కు జైలు ఖాయం: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - May 25 , 2025 | 05:31 AM
టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నట్లు జగన్ పాలనలో భారీ అవినీతి జరగడంతో ఆయనకు జైలు తప్పదని తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుండగా, జగన్ ఐదేళ్లలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి రాలేదని విమర్శించారు.
న్యూఢిల్లీ, మే 24(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ రాష్ట్రానికి ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం కోసం కృషి చేస్తున్నారు. గత సీఎం వైఎస్ జగన్ మాత్రం ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఒక్క రోజు కూడా రాలేదు’ అని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. శనివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘ఢిల్లీ పర్యటన ద్వారా ఏపీకి కలిగే ప్రయోజనాల వివరాలను మీడియా ద్వారా సీఎం చంద్రబాబు ప్రజలకు వివరిస్తుంటే... రాష్ట్రానికి నిధులు తేలేక, మీడియాకు జగన్ ముఖం చాటేసేవారు. జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు అడ్డుఅదుపు లేకుండా సాగాయి. జీవితకాలంలో చేయలేనన్ని తప్పులను జగన్ కేవలం 5 ఏళ్లలోనే చేశారు. అధికారులు కూడా అవినీతి కేసుల్లో జైళ్లకు వెళ్లే దుస్థితి ఏర్పడింది. జగన్ చేసిన అవినీతి, అక్రమాలకు జైలు శిక్ష ఖాయం.’ అని స్పష్టం చేశారు.