YS Jagan: బాబుకు విపక్ష హోదా నేనే ఇచ్చా
ABN , Publish Date - Mar 06 , 2025 | 06:08 AM
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై మాజీ సీఎం జగన్ పొంతనలేని మాటలు మాట్లాడారు. ఇంతమంది ఉంటేనే ప్రతిపక్ష నేతగా గుర్తించాలనే రూల్ ఎక్కడా లేదన్న ఆయన.. పది మంది ఎమ్మెల్యేలను లాక్కోకుండా..
పదిమందిని లాగేస్తే ఆనాడు ఆ హోదా పోయేదట!
పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ: జగన్
అయితే.. విపక్ష హోదాకు సంఖ్య ప్రధానం కాదట!
‘హోదా’పై జగన్ పొంతన లేని మాటలు
అమరావతి, మార్చి5(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై మాజీ సీఎం జగన్ పొంతనలేని మాటలు మాట్లాడారు. ఇంతమంది ఉంటేనే ప్రతిపక్ష నేతగా గుర్తించాలనే రూల్ ఎక్కడా లేదన్న ఆయన.. పది మంది ఎమ్మెల్యేలను లాక్కోకుండా చంద్రబాబుకు 2019లో తానే ప్రతిపక్షనేత హోదా ఇచ్చానంటూ విరుద్ధ వ్యాఖ్య లు చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం చాలాకాలంగా ఆయన పట్టుబడుతుండగా, ఆ హోదా తాము ఇచ్చేది కాదనీ, ప్రజలు మాత్రమే ఇవ్వాలని అధికార పక్షం చెబుతూవస్తోంది. అయినా..అదే అంశంపై జగన్ 2 గంటలకుపైగా మాట్లాడారు. ‘‘అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందేమిటంటే, టీడీపీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలను లాక్కోకుండా ఆనాడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చాను. టీడీపీ సభ్యుల్లో ఐదుగురు అధికార పక్షంలో చేరేందుకు ముందుకొచ్చారు. మా వాళ్లయితే లాగేద్దాం అన్నారు. కానీ, నేను ఒప్పుకోలేదు. చంద్రబాబుకూ, నాకూ తేడా ఇదీ’’ అని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికీ, ఇవ్వకపోడానికీ నిర్దిష్టంగా ఎలాంటి నిబంధనలూ లేవన్నారు. గతంలో 77సీట్లు గెలిచిన ఆప్, మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చిందన్నారు. ‘‘ప్రతిపక్ష హోదా లేకపోతే సభలో ఐదు నిమిషాలు మాట్లాడిచ్చి మైక్ కట్ చేస్తారు. సభా వేదికగా ప్రజాసమస్యలపై గళమెత్తడం సాధ్యం కాదు. అందుకే మీడియాలో స్పందిస్తున్నాను.
నా మాటలకు అధికార పక్షం వచ్చి సమాధానం చెప్పాలి’’ అని జగన్ పేర్కొన్నారు. జగన్‌కు ప్రతిపక్షనేత హోదా కావాలంటే ఓటింగ్ శాతాన్ని బట్టి ప్రతిపక్షనేత హోదాను ఇచ్చే జర్మనీకి వెళ్లాలన్న ఉపముఖ్యమంత్రి పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘‘ఆయన తొలిసారి ఎమ్మెల్యే. కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ’’ అని జగన్ ఎద్దేవాచేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రను కూడా అధికారపక్షమే పోషిస్తుందన్న పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘ఇదేమైనా డబుల్ యాక్షనా పవన్?’’ అన్నారు.
‘ఎంత సేపు పట్టిందబ్బా!’
మీడియా సమావేశం తర్వాత విలేకరులను ‘ఎంతసేపు పట్టిందబ్బా’ అని జగన్ అడిగారు. దాదాపు 2గంటలని విలేకరులు చెప్పగా.. ఈ మాత్రం మాట్లాడకపోతే ప్రజలకు విషయాలు ఎలా తెలుస్తాయని జగన్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్, గవర్నర్ ప్రసంగం మీద ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితుల్లోనే మీడియా ద్వారా స్పందించానన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో రిగ్గింగు చేసేవాడిని చరిత్రలో ఒక్క చంద్రబాబునే చూశామన్నారు.