Share News

Welfare Scheme : అమ్మ ఒడిపై జగన్‌ కనికట్టు

ABN , Publish Date - Mar 07 , 2025 | 05:25 AM

గత ఐదేళ్లలో ఎంతో సంక్షేమం చేశామని గొప్పలు చెప్పుకొన్న జగన్‌... పథకాల్లో కోతలు కోసి కూడా ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నారు.

Welfare Scheme : అమ్మ ఒడిపై  జగన్‌ కనికట్టు

  • ఐదేళ్లలో 26,010 కోట్లు ఇచ్చామన్న జగన్‌

  • తల్లుల ఖాతాలకు చేరింది 23,833 కోట్లే

  • ఐదేళ్లలో పథకం అమలు చేసింది 4 సార్లే

  • చివరి ఏడాది 6 వేలకోట్లు ఇవ్వని వైనం

  • అయినా ఏటా 15 వేలు ఇచ్చినట్లు కలరింగ్‌

  • అసెంబ్లీలో వాస్తవాలు బయటపెట్టిన ప్రభుత్వం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ఐదేళ్లలో ఎంతో సంక్షేమం చేశామని గొప్పలు చెప్పుకొన్న జగన్‌... పథకాల్లో కోతలు కోసి కూడా ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నారు. తప్పుడు ప్రచారంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అమ్మఒడి పథకంపైనా కట్టుకథ చెప్పారు. పిల్లల్ని బడులకు పంపే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ఆయన ఐదేళ్లలో నాలుగు సార్లే అమ్మఒడి నిధులు విడుదల చేశారు. అయితే ప్రతి ఏటా రూ.15 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లుగా జగన్‌ ప్రచారం చేసుకున్నారు. వాస్తవాలను కూటమి ప్రభుత్వం తాజాగా బట్టబయలు చేసింది. తమ హయాంలో రూ.26,010 కోట్లు ఇచ్చినట్లుగా జగన్‌ ప్రచారం చేసుకోగా, అందులోనూ వాస్తవంగా ఇచ్చింది రూ.23,833 కోట్లు మాత్రమేనని అసలు విషయాన్ని బయటపెట్టింది.

కోతల లెక్కలు ఇలా..

‘పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తాం’... అనేది 2019 ఎన్నికల నాటి వైసీపీ మేనిఫెస్టో హామీ. అధికారంలోకి వచ్చాక ఏడు నెలల తర్వాత అమ్మఒడి పథకం తొలి విడత నిధులు విడుదల చేశారు. మొదటి విడతలో రూ.15 వేలు తల్లుల ఖాతాల్లో వేశారు. అయితే అమ్మఒడి నిధుల విడుదల సభలోనే పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి వెనక్కి ఇవ్వాలని జగన్‌ లబ్ధిదారులను కోరారు. అదేంటి.. అలా ఇచ్చి ఇలా అడుగుతున్నారని చాలామంది రూ.వెయ్యి పాఠశాలలకు ఇవ్వలేదు. దీంతో ఇలా అడిగితే వెనక్కి ఇవ్వరని భావించిన ప్రభుత్వం ఆ తర్వాతి సంవత్సరం రూ.14 వేలు మాత్రమే ఖాతాల్లో వేసింది.


ఆ తర్వాత సంవత్సరం మరుగుదొడ్ల నిర్వహణ నిధి(టీఎంఎఫ్‌) కింద రూ.వెయ్యి, పాఠశాలల నిర్వహణ నిధి(ఎ్‌సఎంఎఫ్‌) కింద మరో రూ.వెయ్యి కోత పెట్టి రూ.13 వేలే ఖాతాల్లో జమ చేశారు. మరో ఏడాది కూడా రూ.13 వేలు మాత్రమే తల్లులకు ఇచ్చారు. ఇక ఎన్నికల పేరుతో చివరి ఏడాది అమ్మఒడి నిధులు ఇవ్వలేదు. చివరి సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే యోచనతో ముందుగా అమ్మఒడి నిధులు విడుదల చేసే నెలను మార్చారు. మొదటి రెండేళ్లు జనవరిలో విడుదల చేయగా, మూడో ఏడాది నుంచి జూన్‌కు మార్చారు. దీంతో 2,3 విడతల మధ్య ఏడాదిన్నర గ్యాప్‌ వచ్చింది. ఐదో విడత నిధుల విడుదల సమయానికి ఎన్నికలు వచ్చాయి. ఇక అమ్మఒడిలో పెట్టిన కోతలు మొత్తం లెక్కిస్తే నాలుగు విడతల్లో ఏకంగా రూ.2,177 కోట్లు ఎగ్గొట్టారు. అంతేగాక ఒక విడత పూర్తిగా ఎగ్గొట్టడంతో గత ప్రభుత్వానికి సుమారు రూ.6 వేల కోట్లు మిగిలాయి. జగన్‌ ఇచ్చిన హామీ మేరకు మొత్తంగా రూ.30 వేల కోట్లకు పైగా తల్లులకు విడుదల చేయాల్సి ఉండగా, చివరికి రూ.23,833 కోట్లే అందాయి. కానీ మాజీ సీఎం జగన్‌ ఇప్పటికీ ఐదేళ్లు అమ్మఒడి ఇచ్చామనే ప్రచారం చేసుకుంటున్నారు. పైగా అమ్మఒడిలో కోతలను ప్రస్తావించకుండా ఏటా రూ.15వేలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

అందరికీ తల్లికి వందనం

గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత మంది పిల్లల్ని బడికి పంపినా తల్లుల సంఖ్య ఆధారంగానే అమ్మఒడి అమలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికివందనం అమలు చేయబోతోంది. అప్పట్లో ఏటా సుమారు 43 లక్షల మంది తల్లులకు పథకం వర్తించగా, ఇప్పుడు దాదాపు 80 లక్షల మంది పిల్లలకు పథకం వర్తించనుంది. ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.12 వేల కోట్ల వరకు అవసరం కాగా ప్రభుత్వం మిగిలిన నిధులు సర్దుబాటు చేసి తల్లికి వందనం అమలు చేయనుంది.

Updated Date - Mar 07 , 2025 | 07:41 AM