Nellore: ఐఆర్‌ఎస్ అధికారి పేరిట బురిడీ
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:32 AM
సులభంగా డబ్బు సంపాదించాలని ఐఆర్‌ఎస్ అధికారి అవతారమెత్తాడో మోసగాడు. డాక్టర్ రమేష్ రాపూరు పేరుతో హల్‌చల్ చేస్తున్న అతడిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలను నెల్లూరు డీఎస్పీ పి.సింధుప్రియ..
భూవివాదం పరిష్కరిస్తానని 2 లక్షలు వసూలు
ఆర్జేసీనంటూ ఆలయ భూముల రిపోర్టు కాపీలు స్వాధీనం
ఈవో ఫిర్యాదుతో కర్ణాటక వాసి అరెస్టు
నెల్లూరు(క్రైం), జూన్ 7(ఆంధ్రజ్యోతి): సులభంగా డబ్బు సంపాదించాలని ఐఆర్‌ఎస్ అధికారి అవతారమెత్తాడో మోసగాడు. డాక్టర్ రమేష్ రాపూరు పేరుతో హల్‌చల్ చేస్తున్న అతడిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలను నెల్లూరు డీఎస్పీ పి.సింధుప్రియ శనివారం మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలోని రాయచూర్ దొంగరంపూర్ ప్రాంతానికి చెందిన రాపూరు రమేష్ ఐఆర్‌ఎస్ అధికారిగా అవతారమెత్తారు. భూవివాదం పరిష్కరిస్తామని నెల్లూరు నగరానికి చెందిన వెంకటరమణ వద్ద రూ.2 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బుతో ఐఆర్‌ఎస్ అధికారి అంటూ.. నేమ్ బోర్డులు, స్టాంపులు, ఇతర సామగ్రి కొనుగోలు చేశాడు. ఈనెల 3న తన కారులో నెల్లూరు ఆదిత్యనగర్‌కు వచ్చాడు. వెంకటరమణ ఫోన్ స్విచ్చా్‌ఫలో ఉండటంతో ఆ రాత్రి ఓ లాడ్జిలో బస చేశాడు. 4న నెల్లూరు తల్పగిరి రంగనాథస్వామి ఆలయానికి చేరుకొని ఈవో శ్రీనివాసులరెడ్డిని కలిశాడు. తాను ఐఆర్‌ఎస్ అధికారినని, నెల్లూరు రీజనల్ జాయింట్ కమిషనర్‌గా బదిలీపై వచ్చానని, రిపోర్టు చేసేముందు స్వామిదర్శనానికి వచ్చానని చెప్పాడు. దీంతో ఈవో ఆలయ మర్యాదలతో దర్శనం చేయించారు. అనంతరం వివాదంలో ఉన్న ఆలయ భూముల రిపోర్టు కాపీలను ఈవో దగ్గర నుంచి తీసుకెళ్లాడు. అదేరోజు సాయంత్రం తనను కలవాలని ఫోన్ చేయడంతో ఈవోకు అనుమానం వచ్చింది. ఆరాతీయగా, నకిలీ ఐఆర్‌ఎస్ అధికారి అని తెలిసింది. సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 6న ఆదిత్యానగర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. కారు, సెల్‌ఫోన్లు, స్టాంపులను సీజ్ చేశారు.