Jagan Housing Scam: వైసీపీ కాంట్రాక్టర్లకు మేలు చేసేలా.. మొక్కుబడి తనిఖీలు
ABN , Publish Date - May 19 , 2025 | 04:34 AM
జగనన్న ఇళ్ల స్థలాల చదును పనుల్లో అక్రమాలు బయటపడుతున్నాయి. వైసీపీ కాంట్రాక్టర్లకు మేలు చేసేలా మొక్కుబడి తనిఖీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
మార్గదర్శకాలను పట్టించుకోని అధికారులు
జగనన్న ఇళ్ల స్థలాల చదును పనుల్లో అక్రమాల వ్యవహారం
తనిఖీలు.. నివేదికల తయారీలో తీవ్ర నిర్లక్ష్యం
9,688 పనులు..వెయ్యింటికే నివేదికలు
తనిఖీల్లో పారదర్శకత లేకుంటే వేటేనన్న ఉపాధి డైరెక్టర్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉపాధి హామీ పథకంలో గత ప్రభుత్వం చేపట్టిన ఇంటి స్థలాల చదును పనుల తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులు సమగ్ర మార్గదర్శకాలు ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో తనిఖీలు పకడ్బందీగా జరగడం లేదు. కాంట్రాక్టర్లు, అధికారులను రక్షించేందుకు తనిఖీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తనిఖీలు ప్రారంభించి ఆరు నెలలవుతున్నా... ఏమాత్రం పురోగతి లేదు. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లోని 9,688 పనులు తనిఖీ చేయాల్సి ఉండగా.. 5,233 పనులే తనిఖీ చేశారు. వీటన్నిటికీ నివేదికలు కూడా ఇవ్వలేదు. కేవలం 14 జిల్లాల్లోని 1,019 పనులకే నివేదికలు ఇచ్చారు.
మార్గదర్శకాలు పట్టించుకోకుండా..!
గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.1,125 కోట్ల మేర పనులు వైసీపీ కార్యకర్తల ద్వారా చేపట్టారు. అయితే రూ.1,500 కోట్ల మేరకు పనులు చేసినట్లు దొంగ బిల్లులు పెట్టారు. సుమారు రూ.1,260 కోట్ల మేరకు బిల్లులను గత ప్రభుత్వమే ఎన్నికల ముందు చెల్లించేసింది. ఇంకా రూ.240 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని పనులు చేసినవారు కోర్టును ఆశ్రయించారు. వారికి బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే విత్‌హెల్డ్‌లో ఉన్న బకాయిలు చెల్లించడానికి క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ తనిఖీలు చేపట్టాలని అప్పట్లోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతోపాటు ఇంటి స్థలాల లెవలింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ గత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీంతో ఇంటి స్థలాల చదును పనులను తనిఖీ చేయాలని తాజాగా కమిషనర్ కృష్ణతేజ ఆదేశాలిచ్చారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అయితే ఈ తనిఖీల్లో మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా తనిఖీలు
అప్పట్లో జగనన్న కాలనీల ఇంటి చదును పనుల్లో గ్రావెల్ కొనుగోలు కోసం క్యూబిక్ మీటర్‌కు రూ.134 రికార్డు చేసి, చెల్లించారు. వాస్తవానికి రైతుల నుంచి మట్టి కొనుగోలు చేస్తేనే రూ.134 చెల్లించాలి. అయితే రైతు పొలం నుంచి మట్టి తీసుకునేందుకు తహసీల్దార్ అనుమతి ఇచ్చి ఉండాలి. ఈ మేరకు రికార్డులు పక్కాగా ఉండాలి. ప్రభుత్వ స్థలం నుంచి మట్టి సేకరిస్తే.. కేవలం రవాణా ఖర్చు మాత్రమే లెక్కించాలి. ఈ నిబంధననను పట్టించుకోకుండా.. క్యూబిక్ మీటర్‌కు రూ.134 చొప్పున అన్నిచోట్లా రికార్డు చేసేశారు. ప్రభుత్వ భూముల్లోని మట్టిని సేకరించి క్యూబిక్ మీటర్‌కు రూ.50 అదనంగా వసూలు చేశారు. దీంతో ప్రభుత్వ సొమ్ము భారీగా వైసీపీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లింది. కమిషనర్ ఆదేశాల ప్రకారం ఆయా పనులకు సంబంధించిన రికార్డులు పరిశీలించి, మట్టి కొనుగోలుకు తహసీల్దార్ల అనుమతి ఉందో.. లేదో? పరిశీలించాలి. అనుమతి లేకపోతే రూ.134ను కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయాలి. అయితే ఇదేమీ పట్టించుకోకుండా.. ప్రతి పనికీ రూ.134 చెల్లించేందుకు ఆమోదం తెలుపుతున్నారు. మట్టి కొలతలు తీసే విషయంలోనూ పారదర్శకత లోపించింది. అప్పట్లో పనిచేసిన కాంట్రాక్టర్లకు, అధికారులకు సాయం చేసేందుకు తనిఖీలను తూతూమంత్రంగా నిర్వహిస్తూ.. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే తయారైన నివేదికల్లో కూడా ఆయా కాంట్రాక్టర్లకు చెల్లింపులను జీరో చేశారే తప్ప, అధిక చెల్లింపులను రికవరీ చేసే యోచన తనిఖీలు చేసేవారిలో కనిపించడం లేదు.
తనిఖీల్లో పారదర్శకత లోపిస్తే వేటు తప్పదు: డైరెక్టర్ షణ్ముఖ్‌కుమార్
జగనన్న కాలనీ స్థలాల చదును పనుల తనిఖీల్లో పారదర్శకత లోపించినా, ఉదాసీన వైఖరితో ఉన్నా.. ఆయా అధికారులను బాధ్యులను చేస్తామని ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్‌కుమార్ హెచ్చరించారు. ఇటీవల ఆయన ఉపాధి క్వాలిటీ కంట్రోల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లెవలింగ్ పనుల తనిఖీలపై ఆరా తీశారు. పలు జిల్లాల్లో తనిఖీలు పూర్తిగా నిలిపేయడం, కొన్ని జిల్లాల్లో మందకొడిగా సాగుతుండటంపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా దోచుకున్న వారి పట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి రికవరీలకు సిఫారసు చేయాలని సూచించారు. తనిఖీల పురోగతిని ప్రతి వారం సమీక్షిస్తానని చెప్పారు.