Share News

Vijayawada Guntur Road Tenders : విజయవాడ, గుంటూరు రోడ్ల అభివృద్ధి పనుల టెండర్ల ఖరారులో కావాలనే జాప్యం

ABN , Publish Date - Aug 25 , 2025 | 09:55 PM

కాంట్రాక్టర్ల అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సమస్యలను పరిష్కరించటానికి వీలుగా గడువు పెంచవచ్చు. ఏ సమస్యా లేకుండా సీఆర్డీఏ అధికారులు ఎందుకు గడువు పొడిగిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి..

Vijayawada Guntur Road Tenders : విజయవాడ, గుంటూరు రోడ్ల అభివృద్ధి పనుల టెండర్ల ఖరారులో కావాలనే జాప్యం
Vijayawada Guntur Road Tenders

అమరావతి, ఆగస్టు 25: బెజవాడలో ఎన్ హెచ్-16పై ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలియంది కాదు. విజయవాడ తూర్పు బైపాస్ లేకపోవటంతో ప్రస్తుతం ఎన్ హెచ్ 16 మాత్రమే దిక్కుగా మారింది. ఇది అత్యంత రద్దీగా ఉంటోంది. దీనికి తోడు దేశంలోనే రెండో అతిపెద్ద పారిశ్రామికవాడగా ఉన్న జవహర్ ఆటోనగర్ కూడా అంతర్గత ట్రాఫిక్ తో అట్టుడుకుతోంది. ఈ రెండు సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎన్ హెచ్-18, ఆటోనగర్ అంతర్గత రోడ్ల ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించటానికి వీలుగా, ప్రత్యామ్నాయంగా నిడమానూరు జంక్షన్ నుంచి బల్లెం వారి వీధి మీదుగా, మహానాడు రోడ్డు, బందరు రోడ్డు వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. అలాగే గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అసంపూర్తిగా ఉంది. నగరంలోని ట్రాఫిక్ ను జేకేసీ, విజ్ఞాన కాలేజీల వైపుగా ఆవుటర్లోకి మళ్లించటానికి ఇన్నర్ ఫేజ్-1 పనులు చేపట్టడం అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు పేజ్-3 పను లను చేపట్టాలని నిర్ణయించారు.


ప్రీ బిడ్ మీటింగ్ పేరుతో పొడిగింపు

విజయవాడ రూరల్, అర్బన్ పరిధిలో చేపట్టాల్సిన రోడ్లకు సంబంధించి చూస్తే రూ.75.04 కోట్ల వ్యయంతో మూడు రోడ్లకు టెండర్లు పిలిచారు. రూ.26.51 కోట్ల వ్యయంతో బల్లెంవారి వీధి నుంచి మహానాడు జంక్షన్ వరకు టెండర్లు ఆహ్వానించారు. రూ.25.52 కోట్ల వ్యయంతో మహానాడు రోడ్డును బల్లెంవారి వీది నుంచి పోరంకి వరకు విస్తరించటానికి టెండర్లు పిలిచారు. రూ.22.96 కోట్ల వ్యయంతో బల్లెం వారి వీధి నుంచి మహానాడు రోడ్డు వరకు టెండర్లు ఆహ్వానించారు. ఈ టెండర్లను ఆగస్టు 11వ తేదీ నాటికి బిడ్డ తుది గడువుగా నిర్ణయించారు. అదే రోజున టెక్నికల్ బిడ్లను తెరవాల్సి ఉంది. కాంట్రాక్టర్లతో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించే అధికారం సీఆర్డీఏకు ఉంది. సీఆర్జేడీఏ అధికారులు ఆగస్టు 11వ తేదీ నాటికి, తిరిగి ఆగస్టు 29వ తేదీ నాటికి గడువు పొడిగించారు. టెండర్లు ఎందుకు పొడి గించారని ప్రశ్నిస్తే త్వరలోనే ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు. కాంట్రాక్టర్ల అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సమస్యలను పరిష్కరించటానికి వీలుగా గడువు పెంచవచ్చు. ఏ సమస్యా లేకుండా సీఆర్డీఏ అధికారులు ఎందుకు గడువు పొడిగిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. సత్వరం చేపట్టా ల్సిన పనుల విషయంలో గడువుల మీద గడువులు పొడిగింపు ఎందుకు చేస్తున్నారో అంతు చిక్కని మిస్టరీగా ఉంది.


టెక్నికల్ బిడ్లు తెరిచాక పొడిగింపులు

గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 పనులను జేకేసీ కాలేజీ (స్వర్ణ భారతి నగర్) నుంచి పెదపలకలూరు వరకు రూ.34.87 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. ఆగస్టు 7వ తేదీతో బిడ్ల సమర్పణ తుది గడువుగా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం టెక్నికల్ బిడ్లను ఓపెన్ చేశారు. మొత్తం ఆరు సంస్థలు టెండర్లు వేశాయి. వీటిలో యూబీఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎన్సీసీ లిమిటెడ్, భవానీ కన్స్ట్రక్షన్స్ బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్, మాధవి ఇంజనీరింగ్ కన్ స్ట్రక్షన్స్, శ్రీ సాయినాథ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు బిడ్లను వేశాయి. ఈ సంస్థలు అర్హతల ప్రకారం టెండర్లు వేశాయో లేదో ఏవాల్యుయేషన్ చేశాక. ఆగస్టు 8వ తేదీన ఫైనాన్షియల్ బిడ్లను తెరవాల్సి ఉంటుంది. టెక్నికల్ బిడ్లను తెరిచిన సీఆర్డీఏ అధికారులు ఇప్పటి వరకు ఫైనాన్షియల్ బిడ్లను తెరవటం లేదు. కారణం ఎందుకో చెప్పరు. టెక్నికల్ బిడ్లను తెరిచారు కాబట్టి ఆరుగురు కాంట్రాక్టర్లు వచ్చారని తెలిసింది. ఒక్క కాంట్రాక్టరే టెండర్ వేస్తే వాయిదా వేశారనుకోవచ్చు. ఆరు సంస్థలు పోటీపడినపుడు గడువు పొడిగించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ బిడ్లను తెరిస్తే తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థను ఎల్ 1 గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఫైనాన్షియల్ బిడ్లను ఓపెన్ చేయలేదు. దీనిపై కాంట్రాక్టు సంస్థలు భగ్గుమంటున్నాయి. టెండర్లను వేసి టెక్నికల్ బిడ్లను కూడా తెరిచి సాగదీయటంపై ఆసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు ఫైనాన్షియల్ బిడ్లను తెరవటం లేదని ప్రశ్నిస్తుంటే సీఆర్డీఏ అధికారులు సమాధానం చెప్పటం లేదని కాంట్రాక్టు సంస్థలు విమర్శిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

నారా లోకేష్.. స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు : పల్లా శ్రీనివాసరావు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

For More AP News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 09:55 PM