Injection Shortage : ఇంజెక్షన్లు లేవు..!
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:12 AM
ప్రజారోగ్యం దృష్ట్యా అత్యవసర మందులు, ఇంజెక్షన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచుకోవాలి. కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు నెలలుగా ఇంజెక్షన్ల కొరత నెలకొంది.
ప్రభుత్వాస్పత్రుల్లో సూది మందుల కొరత
జీబీఎస్ చికిత్సలో కీలకమైన ఇమ్యునోగ్లోబలిన్
గుంటూరులో తప్ప మరెక్కడా దొరకని వైనం
టెనెక్టెప్లేస్, ఫ్యాక్టర్, ఇన్సులిన్లకూ కరువే
బయట కొనుక్కోవాలంటున్న వైద్యులు
రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) రోగులు పెరుగుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికి ఇమ్యునోగ్లోబలిన్ ఇంజెక్షన్ ఇస్తే ప్రాణాలు కాపాడవచ్చు..! గుండె పోటు మరణాలను తగ్గించేందుకు టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్స్ చాలా కీలకం. వీటితోపాటు హీమోఫీలియా రోగులకు ఫ్యాక్టర్ ఇంజెక్షన్లు, షుగర్ రోగులకు ఇన్సులిన్.. ఇలా రోగులకు ప్రాణాధారమైన ఇంజెక్షన్లేవీ ప్రభుత్వాస్పత్రుల్లో ఉండడం లేదు. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఓవైపు జీబీఎస్ కేసులు.. మరోవైపు నానాటికీ పెరిగిపోతున్న గుండె జబ్బులు.. మధుమేహ బాధితులు.. ఇలాంటి కీలక సమయంలో అందరి అవసరాలకూ కావలసిన ఇంజెక్షన్ల కొరత ప్రభుత్వాస్పత్రులను వేధిస్తోంది. ప్రజారోగ్యం దృష్ట్యా అత్యవసర మందులు, ఇంజెక్షన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచుకోవాలి. కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు నెలలుగా ఇంజెక్షన్ల కొరత నెలకొంది. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎ్‌సఐడీసీ) నుంచి సరిపడా సప్లయ్ లేక ప్రభుత్వాస్పత్రుల్లో కీలకమైన ఇంజెక్షన్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వైద్యులు కొంతమంది రోగులకు వాటిని బయట కొనుక్కోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జీబీఎస్ చికిత్సలో కీలకమైన ఇమ్యునోగ్లోబలిన్, షుగర్ రోగులకు కావాలసిన ఇన్సులిన్లు, హీమోఫీలియా రోగులకిచ్చే ఫ్యాక్టర్ ఇంజెక్షన్లతోపాటు పాటు స్టెమి కార్యక్రమంలో ఉపయోగించే టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్ల కొరత అధికంగా ఉంది. ప్రస్తుతం జీబీఎస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. దీని నివారణకు ఉపయోగించే ఇంజెక్షన్లలో ఇమ్యునోగ్లోబలిన్ ఒకటి. ఇలాంటి సమయంలో ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుకోవాలి. అయితే గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాత్రమే ఇమ్యునోగ్లోబలిన్ ఇంజెక్షన్లను అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. మిగిలిన ఆస్పత్రుల్లో మాత్రం వీటి కొరత తీవ్రంగా ఉంది. వీటి సరఫరాలో ఏపీఎంఎస్ ఐడీసీ అధికారులు విఫలమవుతున్నారు.
దీంతో పాటు షుగర్ రోగులకు ఉపయోగించే ఇన్సులిన్ కొరత కూడా ఉంది. దీని ధర మార్కెట్‌లో అధికంగా ఉంటుంది. కాబట్టి సాధారణ ప్రజలు వాటిని కొనుగోలు చేసి వాడలేని పరిస్థితి. అలాగే ప్రభుత్వాస్పత్రుల్లో హీమోఫీలియా రోగులకు ఉపయోగించే ఫ్యాక్టర్ ఇంజెక్షన్లను డయాలసిస్ రోగులకు కూడా ఇస్తున్నారు. వీటికి కూడా కొరత ఏర్పడింది. ఏపీఎంఎ్‌సఐడీసీ నుంచి డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు.
స్టెమీలోనూ అంతే...
గుండె సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి, రోగులను ప్రాణాప్రాయం నుంచి కాపాడేందుకు ఆరోగ్యశాఖ స్టెమీ-ఏపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ఎవరికైనా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి గుండె పోటు వచ్చినప్పుడు వెంటనే టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్ అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ఈ ఇంజెక్షన్ ధర కూడా చాలా ఎక్కువ. గతంలో ఈ ఇంజెక్షన్ హృద్రోగులకు మాత్రమే ఉపయోగించేవారు. ప్రస్తుతం న్యూరాలజీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్ విభాగాల రోగులకూ వాడుతున్నారు. సాధారణంగానే ఈ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన విభాగాల రోగులకు కూడా వాడడంతో కొరత మరింత ఎక్కువైంది. టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్ సరఫరా చేసే కంపెనీకి ఏపీఎంఎ్‌సఐడీసీ భారీగా బకాయిలు పడినట్లు తెలుస్తోంది. దీంతో సదరు కంపెనీ ఇంజెక్షన్ల సరఫరా పూర్తిస్థాయిలో చేయడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..