CM Chandrababu Naidu UAE Summit: గ్లోబల్ గేట్‌వే ఏపీ
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:38 AM
అంతర్జాతీయ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్‌వేగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
అపార అవకాశాలున్నాయి.. పెట్టుబడులతో రండి
యూఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
ఏడాదిలో 120 బిలియన్ డాలర్ల
పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
పారిశ్రామికవేత్తలకు నమ్మకం ముఖ్యం
నేనే వారికి సమన్వయకర్తగా ఉంటా
ఏపీలో విస్తృతంగా వనరులు ఉన్నాయి
భారత్‌కు వచ్చాక ముందు ఏపీని చూడండి
ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సులో సీఎం
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్‌వేగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఉత్తర-దక్షిణ భారతాలకు వారధిగా నిలుస్తోందన్నారు. ఏపీని సందర్శించిన తర్వాతే భారత్‌లో ఇతర ప్రాంతాలకు వెళ్లాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పెట్టుబడులు వస్తేనే సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఏడాది కాలంలో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే విధానాలకు రూపకల్పన చేశామని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి నమ్మకం ముఖ్యమని, రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పే ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులకు తాను సమన్వయకర్తగా వ్యవహరిస్తానని చెప్పారు. ఆచరణాత్మక ప్రతిపాదనలతో వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. యూఏఈ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన ‘ఇన్వెస్టోపియా గ్లోబల్-ఆంధ్రప్రదేశ్’ సదస్సులో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రి సమక్షంలో ఏపీ ఎకనామిక్ డెవల్‌పమెంట్ బోర్డు (ఏపీఈడీబీ), యూఏఈ ఇన్వెస్టోపియా పెట్టుబడుల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పెట్టుబడులతో వచ్చిన మరుక్షణం నుంచే ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో పాటు ప్రాజెక్టులు నెలకొల్పడంలో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అన్ని అనుమతులను స్పీడ్ డూయింగ్ బిజినెస్ కింద వేగంగా మంజూరు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అనుమతుల అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తుందని చెప్పారు. అమరావతిలో నాలెడ్జి ఎకానమీ, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చని సూచించారు. దావోస్ పెట్టుబడుల సదస్సులో యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రిని కలిసినప్పుడు రాష్ట్రానికి ఆహ్వానించానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన తొలిపర్యటనలో ఏపీకి రావడం, విజయవాడలో ఇన్వెస్టోపియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇంకా ఏమన్నారంటే..

ఎడారిలో స్వర్గం దుబాయ్..
50 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండే ఎడారి లాంటి దుబాయ్‌లో స్వర్గాన్ని సృష్టించిన తీరు చూస్తే నాకు అసూయ కలుగుతుంది. అక్కడి పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు సందర్శకులకు మంచి అనుభూతి కల్గిస్తాయి. 2021లో ప్రపంచమంతా కరోనా అలజడి సృష్టిస్తే.. యూఏఈ మాత్రం విభిన్నంగా ఆలోచించి ఇన్వెస్టోపియాను స్థాపించి ప్రపంచ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. దుబాయ్‌లో ఇంటర్నెట్ సిటీని చూసి నేను హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించాను. 1.1 కోట్ల మంది జనాభా ఉన్న యూఏఈలో 38 శాతం మంది భారతీయులున్నారు. భారతీయులకు యూఏఈలో విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. భారతీయులు కూడా ఆ దేశానికి అంతే విశ్వసనీయతతో సేవలు అందిస్తున్నారు. యూఏఈ తరహాలోనే ఏపీలో పాలనా వ్యవహారాలన్నీ ఆన్‌లైన్ ద్వారా జరిగేలా చర్యలు చేపట్టాం. ఆగస్టు నుంచి ఎవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ సేవలందిస్తాం. టెక్నాలజీని పెద్దఎత్తున వినియోగిస్తున్న రాష్ట్రంగా.. టెక్ ఫార్వార్డ్ స్టేట్‌గా ఏపీ గుర్తింపు పొందింది.
దేశ అభివృద్ధిలో ఏపీ ముఖ్య భాగస్వామి
ప్రపంచంలో ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2029 నాటికి మూడో స్థానానికి, 2047 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుతుంది. ఈ పురోగతిలో ఏపీ కూడా ముఖ్య భాగస్వామి కానుంది. రాష్ట్రంలోని అపార వనరులను సద్వినియోగం చేసుకుంటూ 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. పీ4 విధానాన్ని ప్రవేశపెట్టి పేదరిక నిర్మూలన కోసం పని చేస్తున్నాం. భవిష్యత్తంతా గ్రీన్ ఎనర్జీ రంగానిదే. 5 గిగా వాట్ల దేశీయ ఉత్పత్తి లక్ష్యంతో ఏపీ ముఖ్య భాగస్వామిగా మారుతుంది. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఎగుమతులకు విశాఖ, కాకినాడ ప్రాంతాల్లో విస్తృత అవకాశాలున్నాయి. దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తీర్చిదిద్దుతాం. దీనికోసం యాక్షన్ ప్లాన్‌ను కూడా సిద్ధం చేశాం. పర్యాటకం, ఆతిథ్యం, ఎలకా్ట్రనిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్, ఆయిల్ గ్యాస్, పెట్రో కెమికల్స్ రంగాల్లోనూ ఏపీలో అపారమైన అవకాశాలు, వనరులు అందుబాటులో ఉన్నాయి.
పెట్టుబడులకు అనుకూలం
పెట్టుబడులకు ఆంధ్ర అత్యంత అనుకూలం. ఫుడ్ బౌల్, చిల్లీ స్పైస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీకి గుర్తింపు ఉంది. అగ్రిటెక్ ఇన్నోవేషన్‌లో అగ్రస్థానంలో ఉంది. పైగా ఏపీకి డైనమిక్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు ఉన్నారు. స్థానిక పరిశ్రమలను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లేందుకు ఇన్వెస్టోపియా తరహా సదస్సులు ఎంతో ఉపకరిస్తాయి.
- ఆర్.ముకుందన్, సీఐఐ అధ్యక్షుడు

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. 2026, జనవరి ఒకటో తేదీ నాటికల్లా ఏపీలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సైబారాబాద్ నగరాన్ని నిర్మించాను. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు. విశాఖలో త్వరలోనే గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ప్రజల ఆరోగ్యం విషయంలో బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఆరోగ్యానికి అనుసంధానం చేసి తక్కువ వ్యయంతో వైద్యం అయ్యేలా కృషి చేస్తున్నాం. హజ్ యాత్రకు వెళ్లేవారి కోసం త్వరలో అమరావతి నుంచి మక్కాకు ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభిస్తాం. మరోవైపు లులూ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖ, విజయవాడల్లో మెగా షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేయనుంది. అమరావతిలో మరో షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయాలని లులూ సంస్థను కోరాం’’ అని తెలిపారు. సదస్సులో పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సీఎ్ కె.విజయానంద్, సీఐఐ ప్రెసిడెంట్ ఆర్.ముకుందన్, లులూ ఇంటర్నేషనల్ సీఎండీ యూసుఫ్ అలీ తదితరులు మాట్లాడారు. సదస్సు అనంతరం సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రి పెట్టుబడుల అంశంపై మరోసారి ద్వైపాక్షిక చర్చలు చేశారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!