Telugu Community: తెలుగు యోధులకు ఢిల్లీలో ఘోర అవమానం
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:12 AM
తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వాతంత్య్ర సమర యోధులకు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర అవమానం జరిగింది.

ఆచార్య ఎన్జీ రంగా, సుందర్‌రావు సమాధుల కబ్జా
మట్టి, రాళ్లతో సమాధులు కప్పేసి.. జిమ్‌కు దారి
తెలుగు రాష్ట్రాల సీఎంలు జోక్యం చేసుకోవాలి
సమాధులను పరిరక్షించాలి.. తెలుగువారి డిమాండ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వాతంత్య్ర సమర యోధులకు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర అవమానం జరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు ప్రజలకు ఆరాధ్యుడైన ఆచార్య ఎన్జీ రంగా, ఆయన అనుచరుడు సుందర్‌రావు సమాధులను రాత్రికి రాత్రే కబ్జా చేసేశారు. వారి సమాధులు కనిపించకుండా మట్టి, రాళ్లతో పూడ్చేసి, తమ జిమ్‌కు రహదారి ఏర్పాటు చేసుకున్నారు. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)కు కూతవేటు దూరంలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్‌క్లేవ్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ స్థలాన్ని కబ్జారాయుళ్ల నుంచి విడిపించి, సమాధుల పరిరక్షణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలని ఢిల్లీలో నివసించే తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమాధులు ఉన్న ప్రాంతాన్ని ఎన్‌ఎ్‌సయూఐ ప్రధాన కార్యదర్శి అనులేఖ బూస, ఏపీ భవన్ అధికారులు, స్థానికులైన రవికుమార్, జీవీ రావు పరిశీలించారు.
ఏం జరిగిందంటే..!
తెలుగువాడైన ఆచార్య ఎన్జీ రంగా, ఢిల్లీకి చెందిన బలక్‌రామ్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. బలక్‌రామ్ కుమారుడు రతీరామ్ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఎన్జీ రంగా అంటే రతీరామ్‌కు ఎనలేని అభిమానం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1980లలో ఎన్జీ రంగా ప్రోద్బలంతో స్వాతంత్య్ర ఉద్యమకారులు ఇళ్లు కట్టుకునేందుకు వీలుగా ఫ్రీడమ్ పైటర్స్ కల్చరల్ సెంటర్ అనే సొసైటీ ఏర్పడింది. దీనికి ఎన్జీ రంగా అధ్యక్షుడు కాగా, సుందర్‌రావు ప్రధాన కార్యదర్శి. స్థానికుడైన రతీరామ్‌కు చెందిన 42.5 ఎకరాలను ఈ సొసైటీ కొనుగోలు చేసింది. ఆ భూమిలో ఫ్రీడమ్ పైటర్స్ ఎన్‌క్లేవ్ పేరుతో 709 ఫ్లాట్లతో కాలనీ నిర్మించారు. ఎన్జీ రంగా అనుచరుడైన రణబీర్‌సింగ్ హుడా, సుందర్‌రావు, రతీరామ్ తదితరులు ఈ కాలనీలో ఇళ్లు నిర్మించుకున్నారు. తన సమాధిని కూడా ఇక్కడే నిర్మించాలని ఎన్జీ రంగా తన కోరికను వెలిబుచ్చారు. రంగా మరణానంతరం సమాధి నిర్మాణానికి రతీరామ్ ముందుకొచ్చారు. ఆయన అస్థికలతో కూడిన చితాభస్మాన్ని తీసుకొచ్చి సమాధి నిర్మించారు. ఆ పక్కనే రంగా అనుచరుడైన సుందర్‌రావు సమాధి కూడా నిర్మించారు. తదనంతరం వారి సమాధుల పక్కనే బలక్‌రామ్, రతీరామ్ దంపతుల సమాధులను రతీరామ్ వారసులు నిర్మించారు. కాలక్రమంలో రతీరామ్ వారసులు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఆస్తుల పంపకాల్లో భాగంగా సమాధుల పక్కన ఉన్న భవనం రతీరామ్ ఐదుగురు కుమారులలో ఒకరైన విజయ్‌దీ్‌పకు వచ్చింది. భూమిరేట్లు పెరగడంతో ఆ సమాధులు ఉన్న ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని విజయ్‌దీప్ ప్రయత్నించాడు.
కాలనీలోని తెలుగువాళ్లు ఆ కుట్రలను తిప్పికొట్టారు. ఇటీవలకాలంలో ఇగ్నోకు వెళ్లే దారిలో మెట్రో రైలు భూగర్భ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ దారి తాత్కాలికంగా మూతపడింది. ఆ దారిలో ఉన్న తన బిల్డింగ్‌ను జిమ్‌సెంటర్ నిర్వహకులకు విజయ్‌దీప్ కిరాయికి ఇచ్చాడు. మార్చి 3న జిమ్‌సెంటర్ ప్రారంభోత్సవం ఉండడం, జిమ్‌కు వచ్చే దారి మూతపడడంతో విజయ్‌దీప్ అండతో జిమ్‌కు వెనుకవైపు సమాధులు ఉన్న స్థలాన్ని నిర్వాహకులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
సమాధులను పరిరక్షించాలి
తెలుగువారికి గర్వకారణమైన ఎన్జీ రంగా, సుందర్‌రావు సమాధులను, ఆ ప్రాంతాన్ని పరిరక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలని ఎన్‌ఎ్‌సయూఐ ప్రధాన కార్యదర్శి అనులేఖ బూస డిమాండ్ చేశారు. ఎన్జీ రంగా సమాధిని పునరుద్ధరింంచాలని జీవీ రావు కోరారు.