Bus Accident: దగ్ధమైన ప్రైవేట్ బస్సు.. పలువురు ప్రయాణికులు మృతి..
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:09 AM
కర్నూలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఉలిందకొండ సమీపంలో బైకును ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 12 మంది కిందకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉలిందకొండ దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టుకుని కిందకు దూకేశారు. బస్సులో ఇంకా 44 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ నుంచి సుమారు 44 మంది ప్రయాణికులతో కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు బెంగళూరుకు బయలుదేరింది. బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే బైకును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని కిందకు దూకేశారు. మిగతా ప్రయాణికులు మంటల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న స్థానికులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం 4 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. బైకును ఢీకొట్టగానే బస్సు కిందకు దూరి ఇంధన ట్యాంక్‌కు తగలడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికుల్లో నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, హారిక, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి ఉన్నట్లు తెలుస్తోంది.

