Higher Education Council: డిగ్రీలో క్వాంటమ్ కంప్యూటింగ్
ABN , Publish Date - May 20 , 2025 | 04:21 AM
ఉన్నత విద్యామండలి డిగ్రీ కోర్సుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. సింగిల్ మేజర్ బదులు రెండు పెద్ద సబ్జెక్టులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
ఒక పేపర్ తప్పనిసరిగా అమలు
ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడి
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): డిగ్రీలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరీక్షను ఉన్నత విద్యామండలి తప్పనిసరి చేసింది. 14 నుంచి 16 క్రెడిట్లతో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ఒక పేపర్ తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి ఆదేశించారు. అదేవిధంగా ఒకే పెద్ద సబ్జెక్టు(సింగిల్ మేజర్) ఉన్న డిగ్రీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు పెద్ద సబ్జెక్టులు ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. సోమవారం యూనివర్సిటీల ఉపకులపతులతో ఆయన సమావేశం నిర్వహించారు. సంప్రదాయ కోర్సుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్‌తోపాటు ఏఐ అండ్ ఎంఎల్ కూడా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దీనిపై బోధనా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. మోడల్ అకడమిక్ క్యాలెండర్‌ను అన్ని యూనివర్సిటీలు తప్పనిసరిగా అమలుచేయాలని కోరారు.