Share News

AP High Court : గ్రూప్‌-2 మెయిన్స్‌ నిలుపుదల కుదరదు

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:59 AM

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

AP High Court : గ్రూప్‌-2 మెయిన్స్‌ నిలుపుదల కుదరదు

అభ్యర్థుల ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయి: హైకోర్టు

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనివల్ల అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. అయితే నోటిఫికేషన్‌ ఆధారంగా జరిపే తదుపరి చర్యలన్నీ తామిచ్చే తుది తీర్పుకి లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నెల 23న జరగనున్న మెయిన్స్‌ పరీక్షను నిలుపుదల చేయాలని కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. ప్రధాన వ్యాజ్యాలపై విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోస్టర్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను నిర్ధారించి గ్రూప్‌-2 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖకు చెందిన ఎం.పార్థసారథి, కడపకు చెందిన కనుపర్తి పెంచెలయ్య, మరో ఇద్దరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, క్రీడాకారులకు ప్రత్యేకంగా రోస్టర్‌ స్లాట్స్‌(రిజర్వేషన్‌ పాయింట్లు) కేటాయిస్తూ 2023 డిసెంబరు 7న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యాలు ఇటీవల విచారణకు రాగా అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... హైకోర్టులో పిటిషన్లు వేసినవారిలో ఇద్దరు మాత్రమే ప్రధాన పరీక్షకు ఎంపికయ్యారని తెలిపారు. ప్రధాన పరీక్షలో అర్హత సాధించినవారు కంప్యూటర్‌ ప్రావీణ్య పరీక్ష(సీవోపీ)కు హాజరుకావాల్సి ఉంటుందని, ఆ తరువాతే రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమల్లోకి వస్తుందని వివరించారు. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. దీంతో అనుబంధ పిటిషన్లపై తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి... మెయిన్స్‌ పరీక్షను నిలుపుదల చేసేందుకు నిరాకరిస్తూ గురువారం నిర్ణయం వెల్లడించారు.

Updated Date - Feb 21 , 2025 | 04:59 AM