Share News

High Court Orders: సీసీటీవీ ఫుటేజ్‌ల తనిఖీకి సహకరించండి

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:19 AM

పోలీస్‌ స్టేషన్లలోని డీవీఆర్‌లో నిక్షిప్తమైన సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేసేందుకు అడ్వొకేట్‌ కమిషనర్‌కు సహకరించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్పీలను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది...

High Court Orders: సీసీటీవీ ఫుటేజ్‌ల తనిఖీకి సహకరించండి

  • కృష్ణా, గుంటూరు ఎస్పీలకు హైకోర్టు ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ స్టేషన్లలోని డీవీఆర్‌లో నిక్షిప్తమైన సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేసేందుకు అడ్వొకేట్‌ కమిషనర్‌కు సహకరించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్పీలను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు ఎస్పీ కార్యాలయం నుంచి అధీకృత అధికారిని సంబంధిత స్టేషన్లకు పంపించాలని స్పష్టం చేసింది. ఈ రెండు జిల్లాల్లో ఏ స్టేషన్‌కైనా వెళ్లి తనిఖీలు చేసేలా అడ్వొకేట్‌ కమిషనర్‌కు అనుమతిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 18 నెలల సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాల్సి ఉంటుందని గుర్తు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్టేషన్లలో రికార్డయిన ఫుటేజీని స్టోర్‌ చేసేందుకు ఎంత స్టోరేజీ అవసరమో చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 23కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్నాన్ని విచారించిన హైకోర్టు.. రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019 జులై 15న ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో యోగేష్‌ కోర్టుధిక్కరణ పిటిషన్‌ వేశారు. మరోవైపు పల్నాడు జిల్లా, మాచవరం పోలీసులు తన సోదరుడు గోపిరాజును అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ కటారు నాగరాజు గత ఏడాది నవంబర్‌లో హెబియస్‌ కార్పస్‌ వేశారు. ఈ పిటిషన్ల విచారణకు సందర్భంగా స్టేషన్‌ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ డీఎస్పీలు సమర్పించిన నివేదికలపై ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తేల్చేందుకు అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 6 పోలీస్‌ స్టేషన్లను పరిశీలించిన అడ్వొకేట్‌ కమిషనర్‌ సీసీ కెమెరాల ఏర్పాటుపై హైకోర్టుకు నివేదిక ఇచ్చారు.


తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 04:19 AM