Share News

AP High Court చేరిన తేదీ ప్రామాణికంగా సీనియార్టీ జాబితా!

ABN , Publish Date - Jan 26 , 2025 | 05:30 AM

హైకోర్టును ఆశ్రయించిన 1995 బ్యాచ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ మోసెసకు న్యాయస్థానంలో ఊరట లభించింది.

AP High Court చేరిన తేదీ ప్రామాణికంగా సీనియార్టీ జాబితా!

  • డీఎస్పీ పదోన్నతులకు మోసెస్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు నిర్దేశం

అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): డీఎస్పీలుగా పదోన్నతి కల్పించే విషయంలో ఉద్యోగంలో చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకొని సీనియార్టీ జాబితాను సిద్ధం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన 1995 బ్యాచ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ మోసెసకు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆ మేరకు సీనియార్టీ జాబితాను సిద్ధం చేయడంతోపాటు డీఎస్పీగా పిటిషనర్‌ స్థానాన్ని ఖరారు చేసి, సర్వీసు ప్రయోజనాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. 2015 అక్టోబరు 5న హోంశాఖ జారీ చేసిన జీవో 153కు అనుగుణంగా ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీగా పదోన్నతి కోసం ఈ దఫా నిర్వహించే డీపీసీలో పిటిషనర్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉద్యోగంలో చేరిన తేదీ ప్రామాణికంగా సీనియార్టీ జాబితాను తయారు చేయాలంటూ పిటిషనర్‌ సమర్పించిన వినతిని తిరస్కరిస్తూ 2021 ఫిబ్రవరి 5న ఏలూరు రేంజ్‌ డీఐజీ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్‌ జడ్జి శుక్రవారం తీర్పు ఇచ్చారు. మోసెస్‌ 2021లో ఈ పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగంలో చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకొని సీనియార్టీ జాబితాను సిద్ధం చేయాలని పిటిషనర్‌ చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ ఏలూరు రేంజ్‌ డీఐజీ 2021 ఫిబ్రవరి 5న ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని, అలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికార పరిధి డీఐజీకి లేదని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 1995 బ్యాచ్‌ ఎస్‌ఐల సీనియారిటీని రీఫిక్స్‌ చేశారని, దానిపై పిటిషనర్‌కానీ, ఆ బ్యాచ్‌ ఎస్‌ఐలుకానీ అభ్యంతరం తెలపలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం, డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన సూచనల మేరకే పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ డీఐజీ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారన్నారు. ఈ వాదనతో న్యాయమూర్తి విభేదించారు.

Updated Date - Jan 26 , 2025 | 05:30 AM