Share News

High Court: కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్‌ సర్వేకు ఓకే

ABN , Publish Date - Jul 03 , 2025 | 06:07 AM

కోటిపల్లి నరసాపురం రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ సర్వేకు మార్గం సుగమమైంది. రైల్వేలైన్‌ రీ అలైన్‌మెంట్‌, భూసేకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో ఇప్పటి వరకు ఉన్న స్టే ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది.

High Court: కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్‌ సర్వేకు ఓకే

  • స్టే ఎత్తివేసిన హైకోర్టు.. త్వరగా చేయాలని ఆదేశం

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ సర్వేకు మార్గం సుగమమైంది. రైల్వేలైన్‌ రీ అలైన్‌మెంట్‌, భూసేకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో ఇప్పటి వరకు ఉన్న స్టే ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. రీ అలైన్‌మెంట్‌కు సంబంధించి సర్వే చేసేందుకు అధికారులకు వెసులుబాటు కల్పించింది. సాధ్యమైనంత త్వరగా సర్వే పూర్తిచేసి ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని రైల్వే అధికారులను ఆదేశించింది. రైల్వేలైన్‌ రీ అలైన్‌మెంట్‌ ద్వారా ఎవరైనా రాజకీయ నాయకులు, బడా వ్యక్తులు లబ్ధిపొందుతున్నారా? అనే విషయాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాజకీయ నాయకులు, బడాబాబుల లబ్ధి కోసం కోనసీమజిల్లా, అమలాపురం సమీపంలోని భట్నవిల్లి-గుడిమెల్లంక మధ్య కోటిపల్లి- నరసాపురం రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ మారుస్తున్నారని, ముందుగా నిర్ణయించిన అలైన్‌మెంట్‌ ప్రకారం ట్రాక్‌ నిర్మాణం చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు బుధవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సత్యప్రసాద్‌ వాదనలు వినిపించారు.


ముందుగా ప్రతిపాదించిన రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ను మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రీఅలైన్‌మెంట్‌ వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది( ఎస్ జీ పీ) ఎస్‌. ప్రణతి, రైలేశాఖ తరఫు న్యాయవాది రుద్ర ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. రైల్వే అలైన్‌మెంట్‌ మార్పు కోసం జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదన చేశారని తెలిపారు. సర్వే నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో ప్రక్రియ ముందు కు సాగలేదన్నారు. దీంతో ప్రాజెక్టు నిలిచిపోయిందని పేర్కొన్నారు. రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ సర్వే, భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు స్టే ఉత్తర్వులు ఎత్తివేయాలని అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. అలైన్‌మెంట్‌ మార్పు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఫలానా దగ్గర లైన్‌ వేయాలని ఎలా చెప్పగలమని వ్యాఖ్యానించింది.

Updated Date - Jul 03 , 2025 | 06:07 AM