Nara Lokesh: వీసీలను బెదిరించామా? నిరూపించండి!
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:30 AM
రాష్ట్రంలో 17 మంది వీసీలు రాజీనామా చేశారని, వారిని బెదిరించి మూకుమ్మడిగా రాజీనామా చేయించారని వైసీపీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు.

ఆధారాలిస్తే విచారణకు ఆదేశిస్తా.. బెదిరించడం మీకు అలవాటు
మండలిలో వైసీపీ ఆరోపణలకు మంత్రి లోకేశ్ సమాధానం
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్ల(వీసీ) రాజీనామాపై శాసనమండలిలో కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. రాష్ట్రంలో 17 మంది వీసీలు రాజీనామా చేశారని, వారిని బెదిరించి మూకుమ్మడిగా రాజీనామా చేయించారని వైసీపీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్.. ‘‘వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామంటున్నారు కదా.. ఆధారాలు ఇవ్వండి. ఇప్పుడే విచారణకు ఆదేశిస్తా. అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు. వాటిని నిరూపించాలి’’ అని సవాల్ విసిరారు. వైసీపీ సభ్యులు గవర్నర్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘వీసీలను మేం బెదిరించడం ఏంటి? గవర్నర్ ఆధ్వర్యంలో వర్సిటీలు నడుస్తాయి. ఎవరు బెదిరించారో చెప్పమనండి. గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌ను రూంలోకి వెళ్లకుండా తాళం వేశారు. మీరా మాట్లాడేది? మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి’’ అని లోకేశ్ డిమాండ్ చేశారు. వీసీలు తప్పు చేశారు కాబట్టే రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. ‘‘బెదిరించడం, భయపెట్టడం, బయటకు పంపండం మీకు అలవాటు’’ అని మంత్రి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. వీసీల విషయంలో ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్పందించిన వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ.. వీసీల రాజీనామా లేఖల్లోనే అధికారులు చేయమన్నారని ఉందని చెప్పారు.