Violent Attack on TDP Workers: జగన్ జన్మదినం వేళ.. వైసీపీ కార్యకర్తల వికృత చేష్టలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 08:58 AM
టీడీపీ కేడర్‌పై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
నరసరావుపేట, డిసెంబర్ 22: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ కేడర్, ఆయన అభిమానులు హద్దులు దాటి వికృత చేష్టలకు దిగారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు ఆదివారం రాత్రి కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డిసెంబర్ 21వ తేదీ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదినం. ఈ నేపథ్యంలో పాకాలపాడు గ్రామంలో భారీగా వైఎస్ జగన్ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేశారు. వాటిలో పలు ఫ్లెక్సీలను ఆగంతకులు ధ్వంసం చేశారు. వీటిని టీడీపీ కార్యకర్తలే ధ్వంసం చేసి ఉంటారని వైసీపీ కార్యకర్తలు భావించి.. వారిపై కర్రలతో ముకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. అయితే పాకాలపాడులో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. వైసీపీలోని ఒక వర్గం వారు.. మరో వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేసినట్లు ఆ గ్రామంలో ఒక ప్రచారం సాగుతోంది. ఈ దాడి ఘటనపై క్షతగాత్రుల నుంచి పోలీసులు దర్యాప్తులో భాగంగా వివరాలు సేకరిస్తున్నారు.
సత్యసాయి జిల్లాలో మరో దారుణం..
సత్యసాయి జిల్లాలోని తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ కార్యకర్తలు టపాసులు కాలుస్తున్నారు. తాను గర్భవతిని.. పక్కకు వెళ్లి టపాసులు కాల్చుకోవాలంటూ వైసీపీ కార్యకర్తలకు గర్భిణి సంధ్యారాణి సూచించింది. దీంతో ఆమె గొంతు పట్టుకుని..కడుపుపై వైసీపీ కార్యకర్త అజయ్ బలంగా తన్నాడు. దీంతో గర్భిణి సంధ్యారాణి కుప్పకూలిపోయింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కదిరి ఆసుపత్రికి తరలించారు. గర్భవతిని పరీక్షించిన వైద్యులు.. కడుపులో బిడ్డ కదిలికలు లేవని తెలిపారు. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. వైసీపీ కార్యకర్త అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గర్భిణి సంధ్యారాణికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.