Kanna Lakshmi Narayana: పరామర్శ పేరుతో అరాచకం సృష్టించిన జగన్
ABN , Publish Date - Jun 24 , 2025 | 03:33 PM
రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మండిపడ్డారు. పరామర్శ పేరుతో జగన్ అరాచకం, అలజడి సృష్టించారంటూ మండిపడ్డారు.
నరసరావుపేట, జూన్ 24: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ప్రజాప్రతినిధులు మరోసారి మండిపడ్డారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో బెట్టింగ్ రాయుడి కుటుంబం పరామర్శకు వైఎస్ జగన్ రావడం సిగ్గు చేటని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. పరామర్శ పేరుతో వచ్చి.. అరాచకం సృష్టించాడంటూ జగన్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం కొత్తూరులో టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు విగ్రహాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వల్లే వైసీపీ ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పరామర్శ పర్యటన పేరుతో తాజాగా ముగ్గురి మృతికి వైఎస్ జగన్ కారణమయ్యారని విమర్శించారు. మృతుల కుటుంబాలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.
రెంటపాళ్లలో పరామర్శ పేరుతో సత్తెనపల్లిలో వైఎస్ జగన్ రెడ్డి అలజడి సృష్టించారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఆరోపించారు. అట్టహాసంగా వైఎస్ జగన్ చేసిన ర్యాలీ కారణంగా.. అంబులెన్స్ ఆలస్యం కావడంతో ఒకరు మృతి చెందారన్నారు. అలాగే మరో ఇద్దరు మృతి చెందారని వివరించారు. ఒకరు పరామర్శకు వచ్చి.. ముగ్గురు చావులకు కారణమయ్యారంటూ వైఎస్ జగన్‌పై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మండిపడ్డారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు వీరు శంకుస్థాపనలు చేశారు.
జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంట్లపాళ్లలో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం అతడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అయితే ఈ పర్యటనకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. ఆ క్రమంలో ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ ప్రయాణిస్తున్న కారు కింద సింగయ్య అనే వృద్ధుడు పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అలాగే ఈ పర్యటనలో మరో వైసీపీ కార్యకర్త సైతం సొమ్మసిల్లి పడిపోయి.. మరణించాడు. ఇక ఈ పర్యటనకు వస్తున్న వైఎస్ జగన్‌ను చూసేందుకు రహదారిపైకి ప్రజలు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో ఒంగోలులో తీవ్ర అనారోగ్యానికి గురైన టీడీపీ కార్యకర్తను అంబులెన్స్‌లో గుంటూరుకు అతడి కుటుంబ సభ్యులు తరలిస్తున్నారు. కానీ జగన్ పర్యటన కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో.. అంబులెన్స్ ముందుకు కదల్లేదు. దీంతో అతడు సైతం మరణించాడు. రెంటపాళ్ల పర్యటనతో ముగ్గురు మరణానికి కారణమయ్యాడంటూ వైఎస్ జగన్‌పై ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.