Nara Lokesh: హిందాల్కో పెట్టుబడులు.. స్వాగతించిన మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:03 PM
2025-30 ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ విధానంలో భాగంగా అత్యంత వేగంగా ( ఫాస్ట్ ట్రాక్) అనుమతులు మంజూరు చేయడంతోపాటు ప్రోత్సాహక మద్దతును ఏపీ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
అమరావతి, నవంబర్ 08: కుప్పంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ప్లాంట్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ప్రపంచ దిగ్గజ లోహాల సంస్థ హిందాల్కో రూ. 586 కోట్లు పెట్టుబడి పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా 61 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా ఐ ఫోన్ చాసెస్‌కు హై గ్రేడ్ అల్యూమినియం సరఫరా చేస్తుందన్నారు. 2027, మార్చి నాటికి ఆపిల్ సంస్థ వాణిజ్య కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్‌ను అనుసంధానిస్తుందని చెప్పారు. ఇది ఎలక్ట్రానిక్స్ ఎకో సిస్టమ్‌లో కీలక మలుపుగా ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.
ఏపీని హిందాల్కో ఎందుకు ఎంచుకుందంటే..?
2025-30 ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ విధానంలో భాగంగా అత్యంత వేగంగా ( ఫాస్ట్ ట్రాక్) అనుమతులు మంజూరు చేయడంతోపాటు ప్రోత్సాహక మద్దతును ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే కుప్పం పట్టణం.. బెంగళూరు నుంచి కేవలం 120 కిలోమీటర్లు.. అలాగే చెన్నై నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ఇది ఆపిల్ కాంట్రాక్ట్ తయారీదారులతో అనుసంధానించడానికి వీలు కల్పిస్తుందని వివరించారు. హిందాల్కో స్థిరత్వ లక్ష్యానికి ఇది అనువైన బలమైన పునరుత్పాదక ఇంధన స్థావరమని చెప్పారు.
ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ విశ్వసనీయ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా కుప్పం మారుతుందన్నారు. తద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో స్థానం సంపాదిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయికి అనుగుణంగా తమ ప్రభుత్వ విధివిధానాలు ఉన్నాయని.. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ఛాంపియన్‌లకు సహజ ఎంపికగా మారుతుందనడానికి ఇది రుజువు అని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఏపీదే : పవన్
For More AP News And Telugu News