Pemmasani Chandrasekhar: గత వైసీపీ పాలకులు జీజీహెచ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు..
ABN , Publish Date - Sep 20 , 2025 | 02:04 PM
గుంటూరు నగరం అభివృద్ధికి పంచ సూత్రాలు పెట్టుకొని పాలన అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. జీజీహెచ్‌లో 8 లిఫ్ట్‌లు ఉంటే 5 పని చేసేవి కావని గుర్తు చేశారు.
గుంటూరు: గత వైసీపీ పాలనలో జీజీహెచ్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. నగరంలో ఏ రోడ్లు చూసిన గుంతలుగా ఉండేదని విమర్శించారు. ఎక్కడ చూసినా.. ఏదో ఒక సమస్య ఉన్న నగరాన్ని ఏడాది క్రితం తమకు అప్పగించారని తెలిపారు. నగరంలో ఉన్న సమస్యలు పరిష్కరించాడనికి ఏడాది సమయం పట్టిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ(శనివారం) ఆయన మీడియాతో మాట్లాడారు..
గుంటూరు నగరం అభివృద్ధికి పంచ సూత్రాలు పెట్టుకొని పాలన అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. జీజీహెచ్‌లో 8 లిఫ్ట్‌లు ఉంటే 5 పని చేసేవికావని గుర్తు చేశారు. గత వైసీపీ హాయాంలో సమయానికి వైద్యులు అందుబాటులో ఉండే వారు కాదని మండిపడ్డారు. సిటీ స్కాన్‌లు పని చేసేవి కావు, రక్త పరీక్షలు బయటకు రాసేవారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జీజీహెచ్‌లో మెరుగైన సేవలు అందిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
గత వైసీపీ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలలపై వైసీపీ చేస్తున్న విష ప్రచారంపై మండిపడ్డారు. దీన స్థితులో ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను పట్టించుకోని మాజీ సీఎం జగన్... 17 మెడికల్ కళాశాలలు కట్టించాడంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆరోపించారు. ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేయడం, మభ్య పెట్టడం జగన్‌కు పరిపాటే అని విమర్శించారు. మెడికల్ కళాశాలలు అంటే నాలుగు గోడలు కట్టి వదిలేయడం కాదు. ఒక్కో కాలేజీ నిర్మించాలంటే కనీసం రూ.500 కోట్లు కావాలి. వాటికి జగన్ ప్రభుత్వంలో ఎంత నిధులు కేటాయించారో చెప్పాలని పెమ్మసాని డిమాండ్ చేవారు.