GBS: కలకలం సృష్టిస్తున్న జీబీఎస్.. ఆ జిల్లాలో కొత్తగా ఎన్ని కేసులంటే..
ABN , Publish Date - Feb 17 , 2025 | 09:50 AM
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ(50) జీబీఎస్ బారినపడ్డారు. ఈనెల 2న రాత్రి తీవ్ర కండరాల నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు గిద్దలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
గుంటూరు: గులియన్ బారే సిండ్రోమ్(GBS) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 59 కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యాధితో ఏపీలో ఇప్పటివరకూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గుంటూరు జిల్లాను జీబీఎస్ బెంబేలెత్తిస్తోంది. ఈ వ్యాధితో గుంటూరు జీజీహెచ్‌లో కమలమ్మ అనే వృద్ధురాలు ఆదివారం నాడు మృతిచెందింది. కాగా, జీజీహెచ్‌లో కొత్తగా మరో 8 కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో ఆశీర్వాదం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల్లో ఇద్దరు కోలుకుని ఇంటికి వెళ్లిపోగా.. మరో నలుగురు సాధారణ వార్డుల్లో చికిత్సపొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇద్దరు మృతి..
కాగా, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ(50) జీబీఎస్ బారినపడ్డారు. ఈనెల 2న రాత్రి తీవ్ర కండరాల నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు గిద్దలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈనెల 3న గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కమలమ్మకు జీబీఎస్ పాజిటివ్‌గా నిర్ధారించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వృద్ధురాలు ఆదివారం నాడు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలుడు సైతం గత వారం ఈ వ్యాధితో మృతిచెందాడు.
వ్యాధి లక్షణాలు ఇవే..
అయితే వ్యాధి లక్షణాలు ప్రారంభంలో అందరిలో ఒకేలా ఉండడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు బయటపడుతున్నట్లు వివరిస్తున్నారు. వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రికి రావడంతోనే మరణాలు సంభవిస్తున్నట్లు పేర్కొంటున్నారు. కొందరిలో దగ్గు, జ్వరంతోపాటు కాళ్లు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరికొందరిలో విరేచనాలతో వ్యాధి లక్షణాలు ప్రారంభం అవుతున్నాయని వెల్లడిస్తున్నారు. ఈ వ్యాధి నరాలపై ప్రభావం చూపుతోందని, యాంటీబాడీలతో శరీరాన్ని దెబ్బతీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మెుత్తం నాడీవ్యవస్థ, మెదడుపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.