Share News

CM Chandrababu: సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 28 , 2025 | 01:16 PM

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 34వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు.

CM Chandrababu: సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి: సీఎం చంద్రబాబు
CM Nara Chandrababu Naidu

అమరావతి, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. 34వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లేందుకు కేంద్రప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు. రాబోయే ఐదేళ్లు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే నిలదొక్కుకోవటంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుముకగా నిలుస్తామని చెప్పుకొచ్చారు.


రాజధాని అమరావతిలో ఇవాళ(శుక్రవారం) ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరాబ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసీ, నాబార్డ్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు ఉన్నతాధికారులు హాజరయ్యారు.


పోలవరం ప్రాజెక్టుకు సహకరించాలి..

అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సముద్రంలో కలిసే మిగులు జలాలు వాడుకుని దేశానికి ఆర్థిక తోడ్పాటు ఇచ్చే పోలవరం అనుసంధాన ప్రాజెక్టుకు సహకరించాలని నిర్మలాసీతారామన్‌ను కోరారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని సూచించారు. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని.. అందుకు తగిన సహాయం అందించాలని విన్నవించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మరో రెండేళ్లు పొడిగించాలని నిర్మలాసీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు.


జగన్ హయాంలో ఐదేళ్లు విధ్వంసం..

‘ఏపీలో జగన్ హయాంలో ఐదేళ్లు విధ్వంసం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చి రాజధాని పనులను పున:ప్రారంభించారు. కేంద్ర సహకారంతోనే అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2028 మార్చి నాటికి పూర్తిచేసేలా పనులు జరుగుతున్నాయి. పనుల వేగవంతానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యకారణం. మాకంటే వేగంగా అమరావతికి రూ.15వేల కోట్ల నిధులు ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల గాడిన పెడుతూ వస్తున్నారు. ఇక్కడున్న ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదు. వినూత్నమైన నగరాన్ని నిర్మిస్తున్నాం. రూ.1,334 కోట్లతో 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయి. బ్యాంక్ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండటంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఎన్నో ఇబ్బందులు..

‘వచ్చే ఏడాది మూడో లార్జెస్ట్ ఎకానమీగా దేశం మారబోతుంది. రాష్ట్ర విభజనతో పదేళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అమరావతి పనులు ఊపందుకున్న సమయంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీలో విధ్వంసం జరిగింది. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీని నిర్మలా సీతారామన్ బయటకు తీసుకొచ్చారు. ఏపీ ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉంది. అమరావతిని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుంది. సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి తయారవుతుంది. 7 జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానం అవుతాయి. 2028 నాటికి అమరావతిలో అన్ని నిర్మాణాలు పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై వేటు వేసిన ఏపీ ప్రభుత్వం

వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదిపై కేసు నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2025 | 01:34 PM