CM Chandrababu Naidu: రాజకీయ నేతల ముసుగులో ఉన్న నేరస్థులను ఏరిపారేయాలి: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Feb 14 , 2025 | 08:28 PM
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, ఏఎస్ రామకృష్ణలతో కమిటీ ఏర్పాటుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు.

అమరావతి: రాజకీయ నేతల ముసుగులో నేరస్థులు ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో గత ఐదేళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తులు ఇప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే టీడీపీ కార్యకర్తల సంక్షేమంపై పార్టీ నేతలతో ఆయన ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, ఏఎస్ రామకృష్ణలతో కమిటీ ఏర్పాటుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కష్టపడి పని చేసి భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్‌ను గెలిపించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే పార్టీ కార్యకర్తల సంక్షేమంపైనా నేతలను ఆరా తీశారు. ఇప్పటివరకూ కార్యకర్తల సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టిందీ, చెల్లించాల్సినవి ఇంకెన్ని ఉన్నాయనే అంశాలను నేతలతో చంద్రబాబు చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "నేరస్థులు రాజకీయం ముసుగులో ఉంటే ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదం. అలాంటి వారిని గుర్తించి ఏరివేయాల్సిన అవసరం ఉంది. గత ఐదేళ్లపాటు రాష్ట్రం రావణకాష్టంగా మారింది. తప్పులు మీద తప్పులు చేసి ప్రజలు, ప్రతిపక్షాలను హింసించారు. ఐదేళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. అది చాలదన్నట్లు ఇప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించాలని తాపత్రయ పడుతున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటివారినైనా ముంచేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. నా దళితులు నా దళితులు అంటూనే వారిని నట్టేట ముంచే రకాలు కనిపిస్తున్నారు. ఆటవిక రాజ్యంలో దాడులు, ఊచకోతలు, విధ్వంసాలు, హత్యలు జరిగాయి. మనది ప్రజాస్వామ్యం, ఇక్కడంతా చట్టపరంగానే పరిపాలన సాగుతోందని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి