CM Chandrababu: లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తున్నాం: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Jan 25 , 2025 | 02:19 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మళ్లీ మెుదలయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,148 కోట్లు ఇవ్వడంతో పనులు పునః ప్రారంభం అయ్యాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు మెుదలుపెట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మళ్లీ మెుదలయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,148 కోట్లు ఇవ్వడంతో పనులు పునః ప్రారంభం అయ్యాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు మెుదలుపెట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం మళ్లీ రివైవల్ ప్యాకేజీ ఇచ్చిందని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు. దావోస్ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తులు సైతం నేడు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "విమర్శలు చేసేవారు ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమైనా తీసుకువచ్చారా?. మాతృభూమి మీద ప్రేమతో వచ్చిన అమరరాజాను వేధించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వంలో అటువంటి వేధింపులు ఉండవు. రూ.95 వేల కోట్లతో BPCL రిఫైనరీ ఏపీలో స్టార్ట్ కాబోతుంది. ఆరు నెలల్లో డీపీఆర్ రెడీ అవుతుంది. అతిపెద్ద రిఫైనరీ రామాయపట్నంలో రూ.96 వేల కోట్లతో వస్తుంది. మిట్టల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తోంది. రూ.1.35లక్షల కోట్లతో పనులు మెుదలుపెడుతున్నారు. మరో సంవత్సరంలో కాకినాడకు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ రాబోతుంది. మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయి. గూగుల్ హెడ్‌తో మొన్న మాట్లాడాం. వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించా. గూగుల్ సెంటర్ వైజాగ్‌లో ప్రారంభమైన వెంటనే అది గేమ్ ఛెంజర్ అవుతుంది. టీసీఎస్ కూడా వైజాగ్‌లో సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. వైజాగ్ త్వరలో ఐటీ హబ్ కాబోతుంది.
ఎంవోయూలతో పరిశ్రమలు రావు..
కేవలం ఎంవోయూలు చేసుకుంటే పరిశ్రమలు వచ్చినట్లు కాదు. మనం చేసే నెట్‌వర్క్ వల్ల భవిష్యత్తులో పరిశ్రమలు వస్తాయి. హైదరాబాద్‌ను అలానే డెవలప్ చేసా. అక్కడ నా తర్వాత సీఎంలుగా వచ్చిన వారు హైటెక్ సిటీని కూల్చలేదు. ఏపీలో ప్రజలు వచ్చి నన్ను కలిసే ప్రజావేదికను కూల్చేశారు. ఆ తర్వాతా విధ్వంసం జరిగింది. వ్యవస్థలు సైతం విధ్వాంసానికి గురయ్యాయి. మనకు రాజధాని ఉన్నా దాన్ని మూడు ముక్కలాట ఆడారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాలూ తగ్గిపోయాయి. వారికి ఇచ్చే రాయితీలూ జగన్ ఆపేశారు. నేను మళ్లీ వీటన్నిటినీ సరిదిద్దుతున్నా. వీటిని మళ్లీ పునర్నిర్మాణం చేస్తున్నా. అందువల్ల ముందు వీటిపై దృష్టి పెట్టాలి. వీటితోపాటు పరిశ్రమలూ తెచ్చుకోవాలి. ఏపీలో పర్యాటక రంగం పెరగాలి. వ్యవసాయంలోనూ డిమాండ్ ఉన్న పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలి. ఆక్వా కల్చర్‌ను పెంపొందించాలి.
బిల్ గేట్స్ సహకారం..
దావోస్ పర్యటనలో బిల్ గేట్స్‌తో మాట్లాడిన సమయంలో ఏఐ, దీప్ టెక్ ప్రాజెక్టుల్లో ఏపీకి అడ్వైజర్‌గా ఉండాలని ఆయన్ని కోరాను. అందుకు బిల్ గేట్స్ అంగీకరించారు. బిల్ గేట్స్ వైద్య రంగంలో కొన్ని వినూత్న పద్ధతులు ఏపీలో చేద్దామని చెప్పారు. ప్రివెంటివ్, క్యూరేటివ్ మెడిసిన్‌లోనూ వినూత్న పద్ధతులకు గేట్స్ మిలిందా ఫౌండేషన్ సహకరిస్తుందని ఆయన చెప్పారు. అయితే ఇవన్నీ చేయాలంటే సుస్థిర పాలన, ప్రభుత్వం కొనసాగింపు ఉండాలి. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం. దావోస్ పర్యటనకు వెళ్తే మనం నాలెడ్జ్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రపంచం ఎటు వెళ్తుందో తెలుసుకోవచ్చు. ప్రపంచం ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఇండస్ట్రీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తోంది. మనం కూడా ఆ దిశగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తులు చేసే వస్తువులు గ్లోబల్ రేంజ్‌లో తయారు చేస్తే ఎక్కువ రేటు సంపాదించవచ్చు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌లో దేశంలోనే ఏపీ హబ్‌గా మారాలి. ఇందు కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అంతర్జాతీయంగా అందరూ ఆమోదిస్తున్నారు. మన వాళ్లకూ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పనిచేసే తత్వం ఉంటుంది. ఏపీలో విధ్వంసమైన బ్రాండ్, వ్యవస్థలను ట్రాక్‌లో పెడుతున్నామని" చెప్పారు.