CM Chandrababu: ఆ సాయంత్రానికి డ్రామా మొదలైంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 16 , 2025 | 08:55 PM
చాలా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు సీఎం చంద్రబాబు సూచించారు. అప్పట్లో వైఎస్ వివేక గుండె పోటుతో చనిపోయారని తనకు చీటి వచ్చిందన్నారు.
అమరావతి, డిసెంబర్ 16: రాజకీయ ముసుగులో నేరాలు చేసే రౌడీలు తయారయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరిలోని పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న కీలక పరిణామాలను ఆయన గుర్తు చేసుకున్నారు. వివేకా హత్య తర్వాత ఆయన గదిలో రక్తపు మరకలు కడిగేశారని చెప్పారు. ఈ విషయం పోలీస్ సీఐకి తెలిసినా.. చెప్పలేదని తెలిపారు.
గుండెపోటుతోనే వైఎస్ వివేకా మరణించారని తాను అనుకున్నానని పేర్కొన్నారు. వివేకాను హత్య చేశారని ఆ రోజు మధ్యాహ్నానికి తెలిసిందన్నారు. ఈ హత్య తర్వాత నారాసుర రక్తచరిత్ర అని తన చేతిలో కత్తి పెట్టారన్నారని తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మి 2019లో వైసీపీకి ప్రజలు ఓట్లు వేశారన్నారు. ఆ రోజే తాను అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ ఎన్నికల్లో ఓడిపోయేవాడిని కాదని చెప్పారు. వివేకా ఇంట్లో ఏం జరిగిందో ఉన్నతాధికారులకు సీఐ సైతం చెప్పలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
చాలా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు ఆయన సూచించారు. అప్పట్లో వివేక గుండె పోటుతో చనిపోయారని తనకు చీటి వచ్చిందన్నారు. అయ్యో అనుకున్నానని తెలిపారు. ఆ తర్వాత ఈ మరణంపై అనుమానం ఉందంటే పోస్ట్‌మార్టం చేయించామన్నారు. ఆ సాయంత్రానికి డ్రామా మొదలైందని చెప్పారు.
అలిపిరిలో క్లెమోర్‌మైన్ పేలినప్పుడు తన వెంట ఎస్పీ వస్తుంటే వద్దని చెప్పానని.. ఈ సంఘటకు కారణమైన వారిని పట్టుకోవాలని సూచించానని తెలిపారు. అప్పుడు కూడా తన డ్యూటీని తాను మరిచిపోలేదని పేర్కొన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే వాళ్లకు ఆఖరు రోజని హెచ్చరించారు. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి లేకుండా చేశామన్నారు.
ఒకప్పుడు ఏపీలో రౌడీయుజం ఉంటే రాష్ట్రం నుంచి బయటకు పంపానని.. ప్రస్తుతం దానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. పాస్టర్ చనిపోతే.. తాను బాధపడ్డానని.. అయితే ఆయన్ని ప్రభుత్వం చంపిందంటూ ప్రచారం చేశారన్నారు. పాస్టర్ ప్రమాదంలో చనిపోతే.. ఆ నేరాన్ని ప్రభుత్వంపై వేయాలని చూశారని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్ తీస్తే పాస్టర్ తాగి బండి నడిపి యాక్సిడెంట్‌లో చనిపోయారని తేలిందని తెలిపారు.
ఆ సపోర్ట్ లేకపోతే ప్రభుత్వం చంపింది.. తానే చంపానని అనేవారన్నారు. సీసీ టీవీ ఫోటోలు వచ్చాయి. దాంతో వాళ్ల నోళ్లు మూతపడ్డాయని చెప్పారు. ఐదేళ్లలో ఎంత పతనావస్తకు దిగజారామోనని తనకు అనిపించిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
For More AP News And Telugu News