BC Janardhan Reddy: గత ప్రభుత్వ అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:30 PM
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో అనేక అక్రమాలు జరిగాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నేడు ఆయన నేడు బయటకు వచ్చి ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, డిసెంబర్ 24: జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయని.. అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం అమరావతిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. స్వామి వారి లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సైతం సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని పేర్కొ్న్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులనే కాకుండా.. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులను కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. అంతేకాదు.. తిరుమల వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పించే విషయంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు.
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నేడు ఆయన నేడు బయటకు వచ్చి ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ పాలనలో అన్నప్రసాదంలో కానీ, వసతి విషయంలో కానీ అక్రమాలన్నీటిని బయటకు తీస్తున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి వివరించారు. డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి అని.. ఆ రోజు 90 శాతానికి పైగా సామన్య భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
అలాగే, లడ్డు ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యిని కూడా అన్ని పరీక్షలు నిర్వహించి తరువాతే లడ్డు తయారీకి ఉపయోగిస్తున్నామని వివరించారు. ఇవన్నీ చూసి ఓర్వలేక.. పత్రికల ద్వారా తిరుమలపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారంటూ వైసీపీ నాయకులపై మండిపడ్డారు. దేవుడి మీద నమ్మకం లేని భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ పదవిని కట్టబెట్టడమే గత ప్రభుత్వ తప్పు అని ప్రజలందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని.. ఇది చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ఇటీవల విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులుగా వచ్చాయన్నారు. దీంతో దేశం మొత్తం ఆంధ్రరాష్ట్ర పురోగతి చూస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనుకోకుండా తలుపు తట్టిన అదృష్టం..
చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
For More AP News And Telugu News