Group-2 Exams: గ్రూప్-2 పరీక్షలపై తప్పుడు ప్రచారం.. ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఆగ్రహం..
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:47 PM
ఆంధ్రప్రదేశ్: గ్రూప్-2 పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ అనురాధ చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులు తప్పుడు ప్రచారం నమ్మెుద్దని తెలిపారు.

అమరావతి: గ్రూప్-2 పరీక్షలు (Group-2 Exams) వాయిదా అంటూ సోషల్ మీడియా (Social Media)లో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మెుద్దని ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ అనురాధ (APPSC Chairperson Anuradha) తెలిపారు. రేపు (ఆదివారం) జరిగే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. అభ్యర్థులంతా పరీక్షలకు హాజరుకావాలని, తప్పుడు ప్రచారం (Fake News) నమ్మి మోసపోద్దని సూచించారు. సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అనురాధ హెచ్చరించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకూ పేపర్-1 పరీక్షా షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని ఆమె చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 05:30 వరకూ పేపర్-2 పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. అభ్యర్థులంతా పరీక్షలకు హాజరుకావాలని ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ అనురాధ చెప్పుకొచ్చారు.
కాగా, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, రోస్టర్ విధానంలో మార్పులు చేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వారు కోర్టుకు వెళ్లగా.. పరీక్షల నిలుపుదలను నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్-2 అభ్యర్థులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. విశాఖ, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. 2023 డిసెంబరు 7న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 77కి విరుద్ధంగా ఉందని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జ్ విస్మరించారని మండిపడ్డారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించి, 23న జరగనున్న గ్రూపు-2 మెయిన్స్ పరీక్షను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష అనంతరం అభ్యర్థుల నుంచి మరోసారి పోస్టుల ప్రాధాన్యతలు తీసుకుంటారని ఏపీపీఎస్సీ తెలిపింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా రూపొందించే ముందు దీనికి సంబంధించిన ప్రక్రియ చేపడతామని చెప్పింది. పోస్టులు, జోన్‌లపై అభ్యర్థులు ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. అలాగే న్యాయం చేస్తానంటూ మంత్రి నారా లోకేశ్ సైతం స్పందించారు. ఈ మేరకు యథావిథిగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Srisailam Tunnel: ఒక్కసారిగా కూలిన పైకప్పు.. శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం
AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్